అమరావతి కట్టడం మా వల్ల కాదు.అందుకే రాజధానిని మూడు ముక్కలు చేసి మూడు ప్రాంతాలకు ఇస్తాం.
దీనివల్ల అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది అని అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు.రాజధాని కోసం తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేస్తామంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రకటించారు.
కానీ అది అంత సులువు కాదన్న విషయం ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది.రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ అనే కొత్త విధానాన్ని గత ప్రభుత్వం అనుసరించినా దానికి చట్టబద్ధత ఉంది.
ఈ విషయం ఇప్పటి ప్రభుత్వానికి తెలుసో లేదో? ప్రభుత్వంతో ప్రజలు ఒక ఒప్పందాన్ని కుదర్చుకొని సంతకాలు చేసి తమ భూములను ఇచ్చారు.
వీటిని తిరిగి ఇచ్చేసి చేతులు దులుపుకుంటామంటే కుదరదు.పరిహారంగా సుమారు రూ.70 వేల కోట్లు చెల్లించాల్సి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.అసలు డబ్బుల్లేకే అమరావతి నుంచి రాజధానిని తరలిస్తామంటున్న ప్రభుత్వం ఇంత మొత్తం ఎక్కడి నుంచి తెస్తుంది? అటు ఎన్నో ఆశలతో ప్రభుత్వానికి భూములు ఇచ్చిన రైతులు కూడా ఈ విషయాన్ని అంత తేలిగ్గా వదలరు.కోర్టుకు కచ్చితంగా వెళ్తారు.
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఓ ప్రాజెక్ట్‌కు సంబంధించి కాంట్రాక్టర్‌ను ఉన్నపళంగా తొలగిస్తే అతను కోర్టుకెక్కాడు.అతనికి పరిహారంగా రూ.450 కోట్లు ఇవ్వాలని కోర్టు తీర్పు చెప్పింది.ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం ఉంది.
రాజధాని కూడా ఓ ప్రాజెక్టే.అందులో భూములిచ్చిన రైతులంతా వాటాదార్లే.
అలాంటప్పుడు వాళ్లందరికీ భారీ స్థాయిలో పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశిస్తే ప్రభుత్వం ఏం చేయగలదు?
అంతేకాదు చంద్రబాబు హయాంలో సీఆర్డీయే బాండ్లను బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్ట్ చేశారు.వీటి అమ్మకం ద్వారా సుమారు రూ.2 వేల కోట్లు వచ్చాయి.మరి ఆ బాండ్లు కొనుగోలు చేసిన వాళ్లకు ఏం సమాధానం చెబుతారు? ఈ పరిణామాలను అంచనా వేయకుండానే జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తాజా పరిస్థితులను చూస్తే అర్థమవుతోంది.