లాంగ్ ఐలాండ్: ఫిబ్రవరి 1:
అమెరికాలోని డెట్రాయిట్ లో తెలుగు విద్యార్ధుల అరెస్టులపై అమెరికాలోని తెలుగు సంఘాలు న్యూయార్క్ లో సమావేశమయ్యాయి.నాట్స్, తానా, ఆటా, నాటా, టాటా, టీఎల్ సీఏ సంఘాలు తెలుగు విద్యార్ధులకు అన్ని విధాల సాయం అందించేందుకు చేపట్టాల్సిన కార్యచరణపై చర్చించాయి.
తొలిసారిగా తెలుగు సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి విద్యార్థులను విడిపించేందుకు చేయాల్సిన ప్రయత్నాలపై చర్చలు జరిపాయి.
ముందుగా అందరూ కాంగ్రెస్ మెన్ థామస్ సుజీ ని కలిసి తెలుగు విద్యార్ధులను మానవతా దృక్ఫధంతో విడుదల చేయాలని కోరాయి.అవగాహన లేకపోవడంతోనే విద్యార్ధులు ఫార్మింగ్ టన్ యూనివర్సీటీ వలలో చిక్కుకున్నారని తెలిపాయి.తక్షణమే వారిని విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతి పత్రం ఇచ్చాయి.
దీనిపై అటు కాంగ్రెస్ మెన్ థామస్ కూడా సానుకూలంగా స్పందించారు.భారత రాయబార కార్యాలయం అధికారులతో కూడా ఆయన మాట్లాడారు.
తెలుగు అటార్నీలు ప్రశాంతి రెడ్డి, జొన్నలగొడ్డలతో కూడా ఈ విషయంలో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు.
అన్ని సంఘాలు ఇప్పటికే అక్కడ తెలుగు విద్యార్ధులకు మేమున్నామని ధైర్యం చెబుతున్నాయి.
రాయబార కార్యాలయంతో పాటు అటార్నీలతో చర్చలు జరిపి వీలైనంత తర్వగా వారిని విడిపించే ప్రయత్నాలు ముమ్మరం చేశాయి.నాట్స్ నుంచి డాక్టర్ మధు కొర్రపాటి, తానా నుంచి జై తాళ్లూరి, నాటా నుంచి స్టాన్లీ రెడ్డి, టాటా నుంచి పైళ్ల మల్లారెడ్డి, ఆటా నుంచి రాజేందర్ జిన్నా, టీఎల్ సీఏ నుంచి పూర్ణ అట్లూరి, వెంకటేష్ ముత్యాల, లాంగ్ ఐస్ ల్యాండ్ డెమోక్రటిక్ పార్టీ నాయకులు శేఖర్ నేలనూతల తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.