యాదాద్రి భువనగిరి జిల్లా: మోత్కూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.ఫిబ్రవరి 9 న బీఆర్ఎస్ చైర్మన్ తీపిరెడ్డి సావిత్రిపై 10మంది అసమ్మతి కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో చైర్మన్ పదవి కోల్పోయిన విషయం తెలిసిందే.
సోమవారం భువనగిరి ఆర్డీఓ పి.అమరేందర్ సమక్షంలో మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన చైర్మన్ ఎన్నికకు కౌన్సిలర్లు నేరుగా క్యాంప్ నుండి ఉదయం 11 గంటలకు సమావేశ మందిరానికి చేరుకున్నారు.నూతన చైర్మన్ ఎన్నిక సందర్భంగా 11వ వార్డ్ కౌన్సిలర్ గుర్రం కవితను చైర్మన్ అభ్యర్థిగా 1వ వార్డ్ కౌన్సిలర్ పురుగుల వెంకన్న ప్రతిపాదించగా,వైస్ ఛైర్మన్ బొల్లెపల్లి వెంకటయ్య బలపర్చడంతో మిగతా 8 మంది చేతులెత్తడంతో గుర్రం కవిత చైర్మన్ గా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఆర్డీఓ, ప్రకటించారు.అనంతరం ఆర్డీఓ అమరేందర్ నూతన చైర్మన్ కవితతో ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, తహశీల్దార్ డి.రాంప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ ఆవరణలో పార్టీ శ్రేణులు పెద్దఎత్తున బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకొని, నూతన చైర్మన్ కవితను సన్మానించారు.చైర్మన్ ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రామన్నపేట సిఐ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.