సూర్యాపేట జిల్లా: కలెక్టరేట్ లో సోమవారం ప్రజావాణి సందర్భంగా వృద్ద దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది.బాధితుల తెలిపిన వివరాల ప్రకారం… మునగాల మండలం బరాఖత్ గూడెం గ్రామానికి చెందిన పిడమర్తి వెంకన్న, ఎలిశమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమారుడు పిడమర్తి చిరంజీవి( Pidamarthy Chiranjeevi ).అతను 2010 లో పోలీసు ఉద్యోగం పొంది,ఏడాది పాటు డిజిపి ఆఫీస్ లో, 2011లో మాజీ సీఎం కేసీఆర్ వద్ద ఇంటలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహించాడు.2013 లో బరాఖత్ గూడెంకు చెందిన రజనితో ప్రేమ వివాహం జరిగింది.వారికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.వారి స్వగ్రామం బరాఖత్ గూడెంలో పది లక్షలు అప్పు చేసి ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపట్టారు.వారి జీవితం సజావుగా సాగుతున్న క్రమంలో 2022 లో చివ్వేంల మండలం దురాజ్ పల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిరంజీవి మృతి చెందాడు.ఇన్సూరెన్స్ డబ్బులు 80 లక్షలు రాగా గ్రామ పెద్ద మనుషులు తల్లిదండ్రులు, భార్య,పిల్లలకు చెందేలా మూడు వాటాలుగా చేసి అగ్రిమెంట్ చేసుకున్నారు.
కానీ,ఆ డబ్బులు కోడలు తల్లిదండ్రులకు ఇవ్వలేదు.అలాగే కొడుకు పేరు మీద ఉన్న మూడు ప్లాట్లను కూడా తానే తీసుకుంది.
తమ ఒక్క కొడుకును కోల్పోయి ఎలా బ్రతకాలని అడిగితే అత్తమామలను దూషిస్తూ వేధింపులకు గురి చేస్తుండడంతో తట్టుకోలేక డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినా,ఇతర అధికారుల చుట్టూ తిరిగినా గాని తమ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు.అందుకే కలెక్టరేట్ ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించామని,మాకు చావే దిక్కు అని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లా కలెక్టర్ స్పందించి ఎలాగైనా మాకు మా కోడలు నుంచి రావాల్సిన డబ్బులు మరియు భుక్తం ఇప్పించే విధంగా చేయాలని వేడుకున్నారు.దీనితో వృద్ద దంపతుల ఆత్మహత్యా యత్నాన్ని అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకొని, మందుడబ్బాను లాక్కొని, వారిని అధికారులకు వద్దకు తీసుకువెళ్లగా,వారి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.