నల్లగొండ జిల్లా: మునుగోడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం గురువారం ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ అధ్యక్షతన నిర్వహించారు.సభ ప్రారంభ సమయంలో సర్పంచుల సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లేందుకు సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు,మునుగోడు సర్పంచ్ మిర్యాల వెంకన్న మైకు ఇవ్వమని అధికారులను కోరడంతో ఎంపీడీవో ఆర్.
భాస్కర్ యు నాన్సెన్స్ గెటవుట్ అని అనడంతో మునుగోడు జెడ్పిటిసి నారాబోయిన స్వరూప రాణి కలగజేసుకొని ప్రజా ప్రతినిధులను గౌరవించకుండా అసభ్య పదాలను వాడటం ఏంటని ప్రశ్నించారు.
అవసరమైతే నువ్వు కూడా వెళ్ళిపో అని జెడ్పిటిసిని అనడంతో ఒక్కసారిగా సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది.
దీంతో ఆగ్రహానికి గురైన జడ్పిటిసి సర్పంచులు,ఎంపీటీసీలు సమావేశ మందిరాన్ని వాకౌట్ చేసి ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నాకు దిగారు.ప్రజా ప్రతినిధులు సమావేశ మందిరం నుండి బయటకు వస్తుండగా వెళ్లిపోయినా పర్వాలేదు.నేను 18 ఏళ్లుగా ప్రభుత్వ అధికారిగా ఉన్నాను.నాకేమీ భయం లేదంటూ అనడంతో అందులో ఉన్న అధికారులు,ప్రజా ప్రతినిధులు ఆశ్చర్యానికి గురయ్యారు.
సమావేశం కొనసాగించేందుకు ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్ ప్రజా ప్రతినిధులను ఆహ్వానించినప్పటికీ ప్రజా ప్రతినిధులను అగౌరపరిచిన ఎంపీడీవో క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేసినా సదరు అధికారి తీరులో మార్పు రాకపోవడంతో సమావేశానికి హాజరుకాకుండా ప్రజాప్రతినిధులు వెళ్ళిపోయారు.ఎంపీడీఓ తీరుపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తామని ప్రజాప్రతినిధులు హెచ్చరించారు.