నల్లగొండ జిల్లా: శాంతియుతంగా తమ సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ల ముట్టడి చేస్తున్న వివోఏలను పోలీసులు నిరంకుశంగా లాఠీ చార్జ్ చేసి,అక్రమ అరెస్టులు చేయడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని జిల్లా ఉపాధ్యక్షులు ఎండి.సలీం జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య అన్నారు.
మంగళవారం వివోఏల అక్రమ అరెస్టులు నిరసిస్తూ సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సీఐటీయూ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై ఏడు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం మొండివైఖరి అవలంబిస్తుందన్నారు.తక్షణమే వివోఏ సంఘాల నాయకులతో చర్చలు జరిపి కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని,ప్రమాద బీమా, ఆరోగ్య బీమా, యూనిఫామ్,అర్హత కలిగిన వారిని సీసీలుగా పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
లేనియెడల ప్రజలు వివిధ రంగాల కార్మికులతో కలిసి సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నెల 29న హైదరాబాద్ సెర్ప్ కార్యాలయం ముట్టడిని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు సాగర్ల యాదయ్య,సలివొజు సైదాచారి,కత్తుల యాదయ్య,వేముల వెంకన్న,యాదగిరి రెడ్డి, శంకర్,కృష్ణయ్య,చంద్రం, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.