తెలంగాణ బిజెపిలో గ్రూపు రాజకీయాలు ఎప్పటి నుంచో ఉన్నా, అవి బయటకు పొక్కకుండా ఎప్పటికప్పుడు బిజెపి అధిష్టానం కంట్రోల్ చేస్తూనే వస్తుంది.ముఖ్యంగా తెలంగాణ బిజెపిలో కీలక నాయకులుగా ఉన్న వారంతా అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్నవారే కావడంతో, ఎవరికి వారు గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.
దీంతో ఎవరి వర్గాన్ని వారు హైలెట్ చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ కారణంగానే తెలంగాణ బిజెపిలో అంతర్గతంగా గ్రూపు రాజకీయాలు అసంతృప్తులు పెరిగిపోతున్నాయి.
మరోవైపు చూస్తే సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడింది.ఈ నేపథ్యంలో అంతర్గత కుమ్ములాటలకు దిగితే తెలంగాణలో కాంగ్రెస్ మాదిరిగా పరిస్థితి తయారవుతుందనే భయం అధిష్టానం పెద్దల్లో ఉండడంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ, అందరిని సమన్వయం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

ముఖ్యంగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, నిజామాబాద్ బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్( Arvind Dharmapuri ) మధ్య అంతగా సఖ్యత లేదు.సంజయ్ తీరుపై బహిరంగంగానే అరవింద్ అప్పుడప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు.ఇక బీఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరి, హుజూరాబాద్ ఉప ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందిన ఈటెల రాజేందర్ కు ఇతర బిజెపి నాయకులకు మధ్య గ్యాప్ ఉంది.తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తో సంబంధం లేకుండా అప్పుడప్పుడు సంచలన ప్రకటనలు ఈటెల రాజేందర్ చేస్తున్నారు.
ఈ వ్యవహారాలు బండి సంజయ్ కు ఆగ్రహం తెప్పిస్తూ ఉంటుంది. అయితే ఇవన్నీ బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతూనే వస్తున్నారు.

ఇక తాజాగా ఈరోజు ఖమ్మం కీలక నేత , మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని బిజెపిలోకి ఆహ్వానించే నిమిత్తం చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్( Etela Rajende ) ఆధ్వర్యంలో బృందం పొంగులేటిని కలిసేందుకు ఈ రోజు ఖమ్మం వెళ్ళింది.అయితే ఇదే విషయాన్ని కరీంనగర్ లో ఉన్న ఎంపీ బండి సంజయ్( Bandi Sanjay ) ను మీడియా ప్రశ్నించగా పొంగులేటి వద్దకు ఈటెల వెళ్లారనే సమాచారం నాకు తెలియదని, నా దగ్గర ఫోన్ లేదని, అందుకే నాకు ఇప్పటివరకు సమాచారం అందలేదని సంజయ్ అన్నారు.

కానీ నాకు చెప్పకపోవడం తప్పేమీ కాదని, ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తారు, నాకు తెలిసిన వారితో నేను మాట్లాడతా , ఈటెల కు తెలిసిన వారితో ఆయన మాట్లాడుతారు.ఇందులో తప్పు ఏమీ లేదు అంటూ సంజయ్ వివరణ ఇచ్చారు .అయితే ఈ విషయంలో మాత్రం అంతర్గతంగా సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారట తెలంగాణ బిజెపి అధ్యక్షుడి హోదాలో ఉన్న తనను సంప్రదించకుండానే ఈటెల రాజేందర్ ఈ విధంగా వ్యవహరించడం సరికాదని తన సన్నిహితుల వద్ద సంజయ్ వాపోతున్నారట.