ఏపీలో రాజకీయాలు హెటెక్కాయి.ఈరోజు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్రను మొదలుపెట్టారు.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన వారాహి వాహనం ద్వారా, ఏపీ అంతటా పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.ఈ క్రమంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ ఆకస్మికంగా నేడు ఢిల్లీ టూర్ కు వెళుతూ ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది.
వాస్తవంగా ఈనెల 30వ తేదీన జగన్ ఢిల్లీ వెళ్లేందుకు ముందుగా ప్లాన్ చేసుకున్నారు.అయితే ఇప్పుడు ఏపీలో రాజకీయ పరిస్థితులు తమకు ఇబ్బందికరంగా మారుతున్న నేపథ్యంలో, జగన్ తన షెడ్యూల్ లు అన్నిటిని వాయిదా వేసుకుని ఆకస్మికంగా ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈరోజు మధ్యాహ్నం గన్నవరం నుంచి ఢిల్లీ వెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.దీంతో జగన్ ఢిల్లీ టూర్ పై సర్వత్ర ఆసక్తి నెలకొంది.
షెడ్యూల్ ప్రకారం చూసుకుంటే జగన్ ఈరోజు గుంటూరు జిల్లా పొన్నూరు, అలాగే హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.అయితే వీటిని అర్ధాంతరంగా రద్దు చేసుకుని, ఢిల్లీ వెళ్లి బిజెపి పెద్దలను కలవాలని జగన్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఈరోజు ఉదయం వైద్య ఆరోగ్యశాఖ పై జగన్ సమీక్ష నిర్వహించారు.అది ముగిసిన అనంతరం ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.బిజెపి కేంద్ర పెద్దలను కలిసి ఏపీలో చోటు చేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై జగన్ చర్చించబోతున్నట్లు సమాచారం. ఈనెల 30వ తేదీన బిజెపి అగ్ర నేతలు జగన్ కు అపాయింట్మెంట్ ఇచ్చారు.
ఇప్పుడు జగన్ ముందుగానే ఢిల్లీ టూర్ కు వెళుతుండడంతో కేంద్ర బిజెపి పెద్దల అపాయింట్మెంట్ ఖరారు అయ్యిందా ? ఢిల్లీ వెళ్ళిన తర్వాత అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తారా అనేది తేలాల్సి ఉంది.
ఇక జగన్ ఆకస్మిక ఢిల్లీ టూర్ పై అటు టిడిపి అధినేత చంద్రబాబు కూడా ఆరాతీస్తున్నట్లు సమాచారం.జగన్ ఏ విషయాలపై చర్చించేందుకు బిజెపి పెద్దలను కలవబోతున్నారనే విషయంపై ఢిల్లీలోని తమ పార్టీ నాయకుల ద్వారా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా ఈరోజు లోకేష్ ‘యువగళం ‘ పాదయాత్ర ప్రారంభమైన వెంటనే జగన్ ఢిల్లీ టూర్ పెట్టుకోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.