రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడితో పాటు ఓ గర్భవతిని పొట్టనబెట్టుకున్న భారత సంతతి డ్రైవర్‌కు యూకే కోర్టు 16 ఏళ్ల జైలు శిక్ష విధించింది.వివరాల్లోకి వెళితే… నిందితుడిని నితేష్ బిసెండరీ (31)గా గుర్తించారు.
అతను ఈ ఏడాది ఆగస్ట్ 10న ఇంగ్లాండ్‌లోని రామ్స్గేట్లోని లియోపోల్డ్ స్ట్రీట్‌లో ప్రయాణిస్తుండగా తన ఆల్ఫా రోమియో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు.దీంతో అది రోడ్డుపై వెళ్తున్న కారుపైకి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో యోరామ్ హిర్ష్‌ఫెల్డ్ (81), అతని కుమార్తె నోగా సెల్లా (37) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.ప్రమాదం జరిగే నాటికి ఆమె నిండు గర్భిణి.
ఇదే ఘటనలో కారులోనే వున్న సెల్లా భర్త , వారి ఇద్దరు పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, ప్రమాదానికి కారణమైన నితేష్‌ను అరెస్ట్ చేశారు.
ప్రమాదకరమైన డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం, విచారణ కోసం బ్లడ్ శాంపిల్స్ నిరాకరించడం వంటి నేరాలపై అభియోగాలు మోపారు.కాంటర్బరీ క్రౌన్కోర్టులో జరిగిన విచారణ అనంతరం గురువారం అతనిని న్యాయమూర్తి దోషిగా నిర్ధారించి 16 ఏళ్ల జైలు శిక్షతో పాటు విడుదలైన తర్వాత పదేళ్ల పాటు డ్రైవింగ్‌కు అనర్హుడని ప్రకటించారు.

పోలీసులకు పట్టుబడ్డ తర్వాత అతను మాదక ద్రవ్యాలను సేకరించాడో లేదో తెలుసుకునేందుకు బ్లడ్ శాంపిల్స్ కోరగా నితేష్ నిరాకరించాడు.ప్రమాదానికి ముందు వాహనంలోని తలెత్తిన లోపాన్ని గమనించిన అతను దానిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తుండగా.ఈ ఘటన జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.మృతురాలు సెల్లా కేంబ్రిడ్జ్‌లో ఫిజీషియన్‌గా పనిచేస్తున్నారు.