2018లో సర్కారీ సిరియా ప్రాథమిక శాలి కాసాగోడు అనే ఒక బాలల సినిమా తీసి దర్శకుడు, నటుడు అయినటువంటి రిషబ్ శెట్టి జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డును అందుకున్నాడు.ఈ సినిమాకు అవార్డులు అయితే వచ్చాయి కానీ కలెక్షన్స్ రాలేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.
ఈ సినిమా కేవలం మూడు కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కించి దాదాపుగా 20 కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది.కర్ణాటకలోని మారుమూల పల్లెటూరులో జరిగిన ఒక పాఠశాలలో విద్యార్థులు ఎలా నలిగిపోతున్నారు, రాష్ట్రాల సరిహద్దుల విషయంలో స్కూలు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి వంటి బాధలు ఏంటో చూపించే కథ ఈ సినిమా.
బడి కోసం, బ్రతుకు కోసం విద్యార్థులు పడుతున్న కష్టాలను సినిమాగా తీశాడు రిషబ్ శెట్టి.
ఇక కాంతారా సినిమా విషయానికి వస్తే ఈ చిత్రం కోసం ఏకంగా 16 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టారు.
ఇక సినిమా కలెక్షన్స్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండి ఇప్పటికే 200 కోట్లకు పైగా వసూలు సాధించింది.కర్ణాటకలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా థియేటర్స్ పెంచుతూ కలెక్షన్స్ సునామీని సృష్టిస్తోంది.
కాంతారా సినిమా ఒక కన్నడ సినిమాకి దక్కిన విజయం.మొత్తం పరిశ్రమకే దక్కిన విజయం గా భావిస్తున్నారు కన్నడ పరిశ్రమ.
ఇక కాంతారా లాంటి ఒక కథను రాసుకొని ఎవరైనా ఒక దర్శకుడు 16 కోట్ల రూపాయలను పెట్టమని ఏదైనా నిర్మాణ సంస్థని అడిగితే పెట్టగలిగే దమ్మున్న నిర్మాత ఎవరైనా టాలీవుడ్ లో ఉన్నారా అనేదే ఒక ప్రశ్న.
కాంతరా సినిమా హిట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మన దగ్గర ఎందుకు ఇలాంటి సినిమా రావడం లేదు.మన దగ్గర ఎందుకు ఇలాంటి కథలు లేవు అంటూ గగ్గోలు పెడుతున్నారు.ఇలాంటి సినిమా తీసే దర్శకులు టాలీవుడ్ లో చాలామంది ఉన్నారు.
కొత్త దర్శకులు కూడా కొత్త కొత్త కథలతో, విభిన్నమైన స్క్రిప్ట్ తో కృష్ణానగర్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నారు.కానీ అలాంటి కథతో వచ్చిన ఒక కొత్త దర్శకుడికి సినిమా అవకాశం ఇచ్చే దమ్మున్న నిర్మాత ఎవరు ? సినిమా తీయాలంటే దర్శకుడికి ధైర్యం ఉండాలి.
ఆ దర్శకుడు అడిగిన బడ్జెట్ కు వెనక ముందు చూసుకోకుండా పెట్టగలిగే నిర్మాత కూడా కావాలి.రొటీన్ లవ్ స్టోరీస్, కమర్షియల్ హంగులు.ఇవే కదా మన నిర్మాతలకు కావాల్సింది అందుకే కాంతార విజయం సాధించిన తెలుగులో ఇలాంటి సినిమా వచ్చే అవకాశం దాదాపుగా లేదు.ఎందుకంటే రిషబ్ లాంటి దర్శకుడికి క్రౌడ్ ఫండ్ తో సినిమా తీసి విజయం సాధించడం ఎలాగో తెలుసు.
అయినా కూడా రిషబ్ ఎందుకు ఆ పని చేయలేదు.కానీ ఎవరైనా తెలుగు దర్శకుడు కొత్తగా క్రౌడ్ ఫండింగ్ కి వెళ్లాలంటే ఎవరు నమ్ముతారు చెప్పండి.మరి తెలుగులో సినిమా తీయాలంటే దర్శకులు ఉంటే సరిపోదు దమ్మున్న నిర్మాత కూడా కావాలి.