నల్లగొండ జిల్లా:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బంధు పథకం అర్హులైన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బొట్టు శివకుమార్,ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సోమవారం నల్గొండ జిల్లా నాంపల్లి మండల తహశీల్దార్ కార్యాలయం ఎదుట కెవిపిఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో వారు పాల్గొని మాట్లాడారు.
మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 5 వేల మంది లబ్ధిదారులకు దళిత బంధు వర్తింపజేయాలన్నారు.ప్రభుత్వం ఎన్నికల కోసమే సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతుందని, అర్వులైన ప్రతి కుటుంబానికి అందటం లేదని ఆరోపించారు.
సంక్షేమ పథకాలకు సరిపడా బడ్జెట్ కేటాయింపులు చేయకుండా ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు.ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్లించి దళితులను దగా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
సబ్ ప్లాన్ నిధుల ద్వారా ప్రతి కుటుంబానికి 10 లక్షలు రూపాయలు ఇవ్వటం పెద్ద సమస్య కాదన్నారు.గత 3 సంవత్సరాలుగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాలకు నేటికీ సబ్సిడీలు ఇవ్వకపోవడం అన్యాయమన్నారు.
దళితులకు ఇస్తామన్న మూడెకరాల భూమి ఎక్కడ అమలు కాలేదని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం దళితులను మోసం చేసిందని విమర్శించారు.
డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకం జాడేలేదని మాటల ప్రభుత్వంగాని, చేతల్లో ఏమీ లేదని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం తహశీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో కౌలు రైతు జిల్లా సంఘ కార్యదర్శి ముత్తిలింగం,వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు కొమ్ము లక్ష్మయ్య,నేరెళ్ల నరసింహ,ఒంగురి యాదయ్య, నూనె లక్ష్మమ్మ,గడ్డం గురుమూర్తి,కృష్ణయ్య,ఆకారపు రజిత,మధ్యల గీత,వాసిపాక యాదమ్మ పాల్గొన్నారు