ఇటీవల తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇద్దరూ తమ చేతుల్లో ఒక పదార్థం వేసుకుని రహస్యంగా తినడం పెద్ద దుమారమే రేపింది.అది గుట్కా అంటూ ఏఐసిసి సభ్యుడు కాంగ్రెస్ సీనియర్ నేత శ్రవణ్, సోషల్ మీడియాలో ఆ వీడియోను వైరల్ చేయడం తదితర కారణాలతో టిఆర్ఎస్ పరువు పోగొట్టుకొంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఆ వ్యవహారంతో వారిని ఇరుకున పెట్టేలా టిఆర్ఎస్ రాజకీయ ప్రత్యర్థులంతా ఈ వ్యవహారాన్ని తెరపైకి తెస్తూ విమర్శలు చేస్తున్నారు.తాజాగా తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మంత్రి గంగుల కమలాకర్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
హుజూరాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ కు వ్యతిరేకంగా ఆయన అనుచరులను టిఆర్ఎస్ వైపుకు తీసుకువెళుతూ, రాజేందర్ పైన బిజెపి పైన తీవ్రస్థాయిలో మంత్రులు విమర్శలు చేస్తున్న క్రమంలో బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు.గుట్కా, గంజాయి, డ్రగ్స్ తీసుకునే మంత్రులా ఈటెల ను ఓడించేది అంటూ సంచలన విమర్శలు చేశారు.
ప్రస్తుతం హుజూరాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సంజయ్ టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేశారు.ప్రస్తుతం ఈటెల రాజేందర్ చేస్తున్న పాదయాత్ర టిఆర్ఎస్ లో కలవరం పట్టిస్తోందని, కేసీఆర్ కు నిద్ర పట్టడం లేదని, ఈటెల గెలిచిన తరువాత నేరుగా అయోధ్యకు వెళ్తాము అంటూ సంజయ్ చెప్పుకొచ్చారు.

తాము ఈ విధంగా ప్రజల్లో పట్టు పెంచుకునేందుకు పాదయాత్రలు నిర్వహిస్తూ ఉంటే, కెసిఆర్ మాత్రం ఇంకా సర్వేలనే నమ్ముకున్నారు అంటూ ఎద్దేవా చేశారు.తాము ప్రజల్లో ఉన్నామని, మీది రాజకీయ డ్రామా అంటూ మండిపడ్డారు.అసలు అంబేద్కర్ జయంతి, వర్ధంతి లకు కేసీఆర్ ఎందుకు వెళ్లడంలేదని సంజయ్ ప్రశ్నించారు.హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తానంటూ కేసీఆర్ గతంలో చెప్పారని, ఆ విగ్రహం ఎక్కడ అంటూ సంజయ్ మండిపడ్డారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నడిబొడ్డున భారీ అంబేద్కర్ విగ్రహాన్ని పెడతాము అంటూ సంజయ్ వ్యాఖ్యానించారు.