త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేపట్టే ఆలోచనలో కేంద్ర అధికార పార్టీ బీజేపీ ఉంది.ఈ కొత్త మంత్రి వర్గ విస్తరణలో ఏ రాష్ట్రాల కు ప్రాధాన్యత ఇవ్వాలి ? మంత్రులుగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపై చాలా సీరియస్ గానే బీజేపీ పెద్దలు ఆలోచిస్తున్నారు.ముఖ్యంగా బీజేపీ బలహీనంగా ఉన్న రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఉండేలా చూస్తూ రాబోయే రోజుల్లో బీజేపీ కి ఏ ఇబ్బంది ఉండదు అనేది కేంద్రం ఆలోచనగా కనిపిస్తోంది.ఇక రెండు తెలుగు రాష్ట్రాల విషయంలో బిజెపి చాలా సీరియస్ గానే ఆలోచిస్తున్నా, ప్రస్తుతం తెలంగాణలో కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ఉన్నారు.
ఇక మరో మంత్రి పదవిని ఎవరికి ఇవ్వాలి అనే దానిపైన కసరత్తు జరుగుతోంది.ఇక ఏపీ విషయానికి వస్తే చాలా మంది పేర్లు పరిశీలనలోకి వస్తున్నాయి.తమకు ఆపద సమయంలో అండగా ఉంటూ, కేంద్రం ప్రవేశపెట్టే బిల్లుకు మద్దతు పలుకుతూ వస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించాలనే ఆలోచన ఒక వైపు ఉండగా , తమ మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజ్యసభ సభ్యత్వం తోపాటు , కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలనేది ఒక ఆప్షన్ గా బీజేపీ పెట్టుకుంది.
అయితే పవన్ మాత్రం బీజేపీ వైసిపి కి దూరంగా ఉంటే సరిపోతుందని , తనకు కేంద్ర మంత్రి పదవి అవసరం లేదనే సంకేతాలను బీజేపీ పెద్దలకు ఇచ్చినట్లు ఇటీవల వార్తలు వచ్చాయి.ఇక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన సుజనా చౌదరి వంటి వారు పేర్లు ప్రచారం లోకి వస్తున్న, ఆయనకు మంత్రి పదవి ఇచ్చినా, బీజేపీ కి అంతగా కలిసిరాదనే లెక్కలు వేసుకుంటున్నారు.ఈ క్రమంలోనే వైసిపి రెబల్ ఎంపీ రఘురామకష్ణంరాజు పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
వైసిపి ప్రభుత్వం విధానాలను ప్రశ్నిస్తూ, నిత్యం ఏదో ఒక సమస్య ను హైలెట్ చేస్తూ, ఏపీ ప్రభుత్వం పై విరుచుకుపడుతూ వస్తున్న రఘురామ కృష్ణంరాజు కొద్ది కాలంగా ఢిల్లీ రాజకీయాల్లోనూ సంచలనంగా మారారు.జగన్ తో వైరం కొనసాగిస్తూనే, తనకు బీజేపీ పెద్దలతో ఉన్న పరిచయాల ద్వారా ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు.
ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇస్తే ఎలా ఉంటుంది ? వైసీపీలోనే ఆయన ఉన్నా, రాబోయే రోజుల్లో బీజేపీ కి కలిసి వచ్చే విధంగా ఆయన వ్యవహరించగలరా ? ప్రస్తుత వైసీపీ దూకుడిని తట్టుకుంటూ బీజేపీ ని బలోపేతం చేయగలరా ఇలా అనేక అంశాలపై విశ్లేషణ చేస్తున్నట్టు తెలుస్తోంది.