శిథిలావస్ధకు చేరుకున్న ఉస్మానియా జనరల్ ఆస్పత్రి భవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్ చేయాలని రాష్ట్ర వైద్య విద్య డైరెక్టర్ (డీఎంఈ) డాక్టర్ కె.రమేష్ రెడ్డి ఆదేశించారు.
ఓల్డ్ బ్లాక్‌లోని డిపార్డ్మెంట్లను వేరేచోటకి మార్చాలని ఆదేశాలు జారీ చేశారు.దీంతో పాత భవనంలో చికిత్స పొందుతున్న రోగులను ఇతర వార్డుల్లోకి తరలించనున్నారు.
పాత భవంతి ప్రమాదకర స్థితిలో ఉండడంతో అక్కడ ఎలాంటి వైద్య కార్యకలాపాలు నిర్వహించకూడదని అధికారులు ఆదేశించారు.
కాగా, ఇటీవల హైదరాబాద్ నగరంలో కురిసిన చిన్నపాటి వర్షానికి ఆస్పత్రిలో ఉన్న వార్డుల్లోకి మురికి నీటితో నిండిపోయిన సంగతి తెలిసిందే.
ఈ ఘటనతో ఉస్మానియా ఆస్పత్రిలో రోగులు నీటిని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.దీంతో ఆ వీడియోలు వైరల్ అయ్యాయి.దీంతో తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.వార్డుల్లోకి నీరు చేరడంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా ఇతర నాయకులంతా ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు చేశారు.
ఉస్మానియా ఆస్పత్రిని పూర్తిగా పడగొట్టి కొత్త ఆస్పత్రి నిర్మిస్తామని 2015లోనే టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకొచ్చింది.కానీ, అప్పుడు విపక్షాల ఎదురుదాడి కారణంగానే కొత్త ఆస్పత్రి నిర్మించలేదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
మళ్లీ భారీ వర్షాలు పడితే, ఇంకేదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నందున తక్షణం పాత భవనం ఖాళీ చేసి, సీల్ చేయాల్సిందిగా మెడికల్ ఎడ్యుకేషనల్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.