అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా ఉంది బీజేపీ పరిస్థితి తెలంగాణలో తొందర తొందరగా బలం పెంచుకుని వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి అధికారం దక్కించుకోవాలని ఆశ పడుతోంది.అయితే అందుకు తగ్గ పరిస్థితులు కల్పించుకునేలా ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తోంది.
దీనిలో భాగంగానే తెలంగాణలో అధికార పార్టీ గా ఉన్న టిఆర్ఎస్ పార్టీని ఇరుకున పెట్టే ప్రతి అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది.అదీకాకుండా తెలంగాణలో గెలుచుకోలేమనుకున్న ఎంపీ సీట్లు గెలుచుకోవడం కూడా బిజెపిలో ఆశలు పెంచుతున్నాయి.
ఇప్పటికే తెలుగుదేశం, కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు చెందిన ద్వితీయ శ్రేణి నాయకులను చేర్చుకొని దూకుడు ప్రదర్శిస్తోంది బీజేపీ.ఇక అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి వచ్చేస్తున్నారు అంటూ బిజెపి తాజాగా మైండ్ గేమ్ మొదలు పెట్టింది.
అధికార పార్టీకి చెందిన సుమారు 13 మంది ఎమ్మెల్యేలు బిజెపి లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు అంటూ ఆ పార్టీని కంగారు పెడుతోంది.తాము ఒకే చెప్పడం ఆలస్యం ఎమ్మెల్యేలంతా చేరుకోవడానికి రెడీగా ఉన్నారు అంటూ పదే పదే ప్రకటనలు చేస్తూ హడావుడి చేస్తోంది.కానీ ఆ విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడడం లేదు.దీంతో బీజేపీ చెబుతున్న మాటల్లో నిజమెంత అనే సందేహం అందరిలోనూ మెదులుతోంది.ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే ఒకరు బీజేపీ ఎంపీ అర్వింద్‌ను కలవడంతో చేరికలు మొదలైనట్టేనని అందరూ అనుకున్నారు.కానీ, తాను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని, ఇందులో రాజకీయం ఏమీలేదు అంటూ సదరు ఎమ్యెల్యే చెప్పుకున్నారు.
అయితే తాత్కాలికంగా బీజేపీ చేరికలకు బ్రేకులు వేసిందంటూ ఆ పార్టీ నాయకులు చెప్పుకున్నారు.
ఆ తర్వాత గత సెప్టెంబర్17న హైదరాబాద్‌కు పార్టీ అగ్రనేత అమిత్‌షా వస్తున్నారని, అదే రోజు తెలంగాణలో కీలక పరిణామాలు ఉంటాయని, ఇతర పార్టీల నుంచి భారీగా చేరికలు ఉంటాయని రాష్ట్ర బీజేపీ నేతలు అప్పట్లో హడావుడి చేశారు.కానీ, ఆరోజు వచ్చింది, వెళ్ళింది ఇంత వరకూ ఎవరు కూడా చేరలేదు.ఇప్పుడు మళ్లీ అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ కొద్దిరోజుల క్రితం నిజామాబాద్ ఎంపీ అర్వింద్ చెప్పుకొచ్చారు.
అయితే అదీ నిజం అవ్వలేదు.ఇక ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదుర్కుంటోంది.
ఆర్టీసీ సమ్మె, ప్రజా సమస్యల విషయంలో టీఆర్ఎస్ కార్నర్ అవుతుండడంతో టీఆర్ఎస్ ఎమ్యెల్యేలను చేర్చుకుని షాక్ ఇవ్వాలని బీజేపీ చూస్తోంది.కానీ ఇప్పుడైనా అది జరుగుతుందా అనేది అనుమానంగా కనిపిస్తోంది.