తెలంగాణాలో సీమాంధ్రుల మీద అన్ని రాజకీయ పార్టీలకు ఎక్కడ లేని ప్రేమ పెరిగిపోయింది.వారు అడిగినా అడగకపోయినా పార్టీలు మాత్రం వరాల జల్లులు కురిపిస్తూ వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో అయితే సీమాంధ్ర ఓటర్లు చాలామందే ఉన్నారు.ఇప్పుడు వారంతా ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతారా అనేది అన్ని పార్టీల్లోనూ ఒకటే ఉత్కంఠ నెలకొంది.
ఇక టీఆర్ఎస్ పార్టీ అయితే సెటిలర్స్ అందరిని మేము కంటికి రెప్పలా కాపాడతామని, మనమంతా ఒక్కటేనని, మేము ఆంధ్ర గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినా అవన్నీ కేవలం రాజకీయ పార్టీల మధ్య పోరు మాత్రమేనని మీరు అవేవి పట్టించుకోవద్దు అంటూ కేటీఆర్ నష్ట నివారణ చర్యలకు దిగాడు.
![](https://telugustop.com/wp-content/uploads/2018/10/Settlers-In-Hyderabad-Going-to-Support-Which-Party-1.jpg)
గ్రేటర్ హైదరాబాద్‌లో ఉన్న ఏడెనిమిది నియోజకవర్గాల్లో సీమాంధ్రుల ఓట్ బ్యాంక్ బలంగా ఉంది.కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్ నగర్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, ఎల్బీ నగర్, పటాన్‌చెరు, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నంలాంటి నియోజకవర్గాల్లో కొంతమేర ప్రభావం చూపొచ్చని అంచనా వేస్తున్నారు.పాతబస్తీలోని ఏడు నియోజకవర్గాలు మినహాయిస్తే హైదరాబాద్, దాని చుట్టుపక్కల నియోజకవర్గాలు ఖచ్చితంగా కీలకం.
అందుకే టీఆర్ఎస్ పార్టీ అన్ని పార్టీలకంటే ఎక్కువ ఇక్కడ దృష్టిపెట్టింది.మహాకూటమి కావాలని విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపిస్తున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కీ కౌంటర్ ఇచ్చారు.గతంలో ఆంధ్రులను తిట్టి, ఆంధ్రా విద్యార్థులకు లబ్ధి జరగకుండా ఫాస్ట్ పథకాన్ని తీసుకొచ్చిన వారు ఇప్పుడు సీమాంధ్రులను కాకాపట్టడం అవకాశవాద రాజకీయం అని మండిపడ్డారు.
2014 ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే టీఆర్ఎస్ విజయం సాధించింది.టీడీపీ తొమ్మిది నియోజకవర్గాల్లో గెలుపొందింది.
కానీ, వారిలో ఆర్.కృష్ణయ్య మినహా మిగిలిన వారు టీఆర్ఎస్‌లో చేరిపోయారు.ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీన్ మారింది.కారు దూసుకుపోయింది.మొత్తం 150 డివిజన్లలో 99 చోట్ల టీఆర్ఎస్ గెలుపొందింది.అప్పుడు ఆంధ్రా ఓటర్లు కూడా టీఆర్ఎస్ కి అండగా నిలబడ్డారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీడీపీ ఏం చేస్తుందనే అభిప్రాయం ఓ వైపు, అప్పటికే టీడీపీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరడంతో కూడా ఓటర్ల అభిప్రాయం మారి ఉండొచ్చని అంచనా వేశారు.అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటి అనేది తేలాల్సి ఉంది.
![](https://telugustop.com/wp-content/uploads/2018/10/Settlers-In-Hyderabad-Going-to-Support-Which-Party.jpg)
గతంలో ఉన్న లెక్కలు ఇప్పుడు లేవు.కాంగ్రెస్ , టీడీపీ, టీజేఎస్ పార్టీలు కలసి మహాకూటమిగా ఏర్పడ్డాయి.మరోవైపు ఏపీలో జగన్ మీద జరిగిన దాడి అంశం కూడా హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రుల మీద కొంత మేర ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.ఇది ముందుగానే అంచనా వేసిన టీఆర్ఎస్ జగన్ పై దాడి జరిగిన వెంటనే స్పందించింది.
కేటీఆర్, కవిత ట్విట్లు చేయగా… కేసీఆర్ ఫోన్ చేసి పరామర్శించాడు.ఈ నేపథ్యంలో సెటిలర్స్ లో కొంతమంది జగన్ ను అభిమంచేవారు ఖచ్చితంగా టీఆర్ఎస్ వైపు మళ్లే అవకాశం కనిపిస్తోంది.
టీడీపీ అభిమానులు మహాకూటమివైపు ఎలాగూ ఉంటారు.ఇక ఏపీలో జగన్ పై దాడి జరగడం టీఆర్ఎస్ శరవేగంగా స్పందించడం ఈ పరిణామాలతో తటస్థులు ఎటువైపు మొగ్గుచూపుతారు అనేది లెక్క తేలాల్సి ఉంది.