వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి ఏపీలో అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీ.ఈ క్రమంలోనే పార్టీ అధినేత జగన్ ప్రజల్లోకి దూసుకుపోతున్నారు, పాదయాత్ర చేస్తున్నారు.
ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేయాలని భావిస్తున్నారు.ఇంత వరకు బాగానే ఉన్నా.
వచ్చే ఎన్నికల విషయంలో జగన్ ఎందుకో ఒకింత అనుమానాలు వ్యక్తం చేస్తున్నారనే వ్యాఖ్యలు తరచుగా వినిపిస్తున్నాయి.వచ్చే ఎన్నికలు మొత్తంగా డబ్బు మాత్రమే శాసిస్తుందని, డబ్బులు లేక పోతే.
పనులు జరగడం కష్టమని ఆయన నమ్ముతున్నట్టుగా వైసీపీలోనే చర్చ సాగుతోంది.అదేసమయంలో జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఆయనపై వ్యతిరేక ప్రచారాన్నే పెంచుతున్నాయి.

ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఇంచార్జులను జగన్ ఎడా పెడా మార్చిన విషయం తెలిసిందే.ఇక, ఈ క్రమంలోనే నెల్లూ రుకు చెందిన బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి జగన్‌పై చాలా తీవ్రమైన కామెంట్లు చేశారు.ఎమ్మెల్యే టికెట్ కోసం రూ.50 కోట్లు అడిగారని విమర్శలు గుప్పించారు.ఈ వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించాయి.అయితే.దీనిపై వైసీపీలో చర్చ జరిగినా.పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.
కానీ, ఇప్పుడు ఇలాంటి ఘటనే ఒకటి తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురంలో చోటు చేసుకుంది.పెద్దాపురం నియోజకవర్గ వైసీపీలో పార్టీ కో-ఆర్డినేటర్‌గా కొనసాగిన తోట సుబ్బారావు నాయుడును పక్కనపెట్టి ఆయన స్థానంలో ఎన్‌ఆర్‌ఐ దవులూరి దొరబాబును పార్టీ అధిష్ఠానం కోఆర్డినేటర్‌గా నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

దీంతో పార్టీ కార్యకర్తల్లో అయోమయ స్థితి నెలకొంది.అతి స్వల్పకాలంలో పార్టీలోకి చేరిన దవులూరి దొరబాబు కోఆర్డినే టర్‌గా నియమితులు కావడం వెనుక పార్టీ అధిష్ఠానం ఆర్థిక బలం వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోందనే ప్రచారం జరుగుతోంది.ఇప్పటివరకూ పార్టీకి అన్నీ తానై నడిపించిన సుబ్బారావునాయుడును కాదని పార్టీ అధిష్ఠానం వేరొకరికి కోఆర్డినేటర్ పదవిని కట్టబెట్టడంతో ఆయన వర్గీయులు ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.ఈ విషయంపై అధిష్ఠానం వద్ద చర్చించేందుకు అధినేత జగన్ దగ్గరకు వెళ్లే యోచనలో ఉన్నారని సమాచారం.
సుబ్బారావునాయుడికి టికెట్ ఇవ్వకపోతే తామంతా ప్రత్యామ్నాయం చూసుకుంటామని చెప్పే యోచనలో ఉన్నట్లు సమాచారం.ఇక్కడే కాదు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ ఆర్ధిక స్థితిమంతులు కోసం జగన్ వెతుకులాట ప్రారంభించారు.
దీంతో జగన్ డబ్బుల మనిషి అనే ప్రచారం ఊపందుకుంటోంది.మరి ఇది వ్యూహాత్మకంగా జరగుతున్న ప్రచారమా? లేక మరొకటా? అనేది తేలాల్సి ఉంది.







