కరోనా మహమ్మారి తాను మూడేళ్ళ క్రితం తొలుత ఉనికిలోకి వచ్చిన దేశం,చైనాని ఇంకా వీడిపోవడం లేదు.ప్రపంచదేశాల్ని రెండేళ్లు పట్టిపీడించిన మహమ్మారి ప్రస్తుతానికి అన్నిచోట్లా అదుపులోనే ఉన్నా చైనాలో మాత్రం వేలకొద్దీ కేసులు ఇప్పటికీ నమోదౌతున్నాయి.
మిగతా దేశాలు కరోనా తో సహజీవనం అన్న లైన్ లో దాన్ని ఎదుర్కోగా చైనా మాత్రం దాన్ని ఢీకొట్టడం అన్న లైన్ తీసుకుంది.జీరో కోవిడ్ విధానం అమలుచేస్తూ అందులో భాగంగా పెద్ద ఎత్తున టెస్టింగ్ చెయ్యడం,లాక్ డౌన్ లు అమలు చెయ్యడం లాంటి కార్యక్రమాలు కొనసాగిస్తోంది.
బహుశా ఆ విధానం సరైనది కాదు.తాత్కాలికంగా బాగా పనిచేసినవిధానాన్ని దీర్ఘకాలికంగా అమలు చెయ్యడం వల్ల నష్టమే ఎక్కువ.
నెలల తరబడి లక్షలాది మంది ఇళ్లు దాటలేని స్థితిలోనే ఉండడం,ఆర్థికంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా చిక్కుల్ని తెస్తుంది.

మిగతా దేశాలు భిన్నమైన విధానం పాటించడం వల్ల ప్రజల్లో వైరస్ చలామణీ అయ్యి,తన ప్రభావాన్ని కోల్పోయింది.హెర్డ్ ఇమ్మూనిటీ త్వరగా వఛ్చి టీకా లా పనిచేసింది.ప్రస్తుతం చైనా లో పలు పట్టణాల్లో వైరస్ వ్యాప్తి చెందడం అన్నది అక్కడ జరుగుతున్న అధికసంఖ్యలో టెస్టులు వల్లనే అనుకోడానికి లేదు.
జీరో కోవిడ్ విధానం వల్ల లాక్ డౌన్ ల వల్ల త్వరితంగా హెర్డ్ ఇమ్మూనిటీ సాధ్యం కాలేదు.ఇప్పటికైనా ఆ దేశం తన విధానాన్ని సమీక్షించుకోవాల్సి ఉంటుంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికల్ని,మిగతా దేశాల అనుభవాల్ని గమనంలోకి తీసుకోవాల్సి ఉంటుంది.ఇప్పటికే ప్రజలు పలు పట్టణాల్లో నిరసనల్ని తెలుపుతున్నారు.
మహమ్మారి ని అదుపు చెయ్యడానికి ప్రజల్ని ఒప్పించడం అన్నది ముఖ్యం.ప్రపంచ దేశాలు కూడా వైజ్ఞానిక పరంగా,వైద్య పరంగా చైనాకు సహకరించాలి.
ఎందుకంటే ప్రపంచంలో ఏ మూల మహమ్మారి క్రియాశీలం గా ఉన్నా,అది అందరికీ ఉపద్రవమే.గడచిన రెండేళ్లలో కరోనా నేర్పిన పాఠమే ఇది.