అమెరికాలో తెలుగు యువతి అరుదైన ఘనత సాధించింది.ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన యూఎస్ నేవీలో పైలట్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన దొంతినేని శ్రీనివాస్, అనుపమల కుమార్తె దేవీశ్రీ న్యూయార్క్‌లోని లాంగ్ ఐలాండ్‌లో పుట్టి పెరిగింది.
ఆమె పదవ గ్రేడ్‌లో ఉన్నప్పుడు ఓసారి మేరీల్యాండ్‌లోని అన్నాపోలిస్ నేవీ అకాడమీని చూసేందుకు వెళ్లింది.
అక్కడి నేవల్ అధికారిణిగా విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ఆమె సాధించిన విజయాలపై ఇచ్చిన ప్రసంగం.దేవీశ్రీని ఆలోచింపచేసింది.ఇదే ఆమెను నేవీ దిశగా అడుగులు వేసేలా చేసింది.అదే సమయంలో నేవీలో అడ్మిరల్, ఇప్పటి నార్వేలో అమెరికా రాయబారి కెన్నెత్ బ్రైత్ వైట్‌ను దేవీశ్రీ తన తల్లిదండ్రులతో పాటు కలిసి తన ఆశయాన్ని వివరించింది.
దేవీశ్రీకి కెన్నెత్ బ్రైత్ ప్రోత్సాహం అందించడంతో పాటు నేవీకి దరఖాస్తు, ప్రవేశం, శిక్షణ తదిరత అంశాలపై పలు సూచనలు చేశారు.ఆయన ఇచ్చిన స్ఫూర్తితో దేవీశ్రీ మొక్కవోని దీక్షతో కష్టపడింది.

2015 వేసవిలో యునైటెడ్ స్టేట్స్ నేవల్ అకాడమీ (యూఎస్ఎన్ఏ)కు దరఖాస్తు చేసుకుంది.అదే ఏడాది డిసెంబర్‌లో అమెరికా నేవీ అధికారులు అమె దరఖాస్తును ఆమోదించారు.ఇక్కడే ఓ చిక్కొచ్చిపడింది.సైన్యంలోకి అబ్బాయిలను పంపడానికే సవాలక్ష ఆలోచించే తల్లిదండ్రులు ఉన్న ఈ కాలంలో దేవీశ్రీ పేరేంట్స్ సైతం భయపడ్డారు.అయితే దేశానికి సేవ చేయాలనే తన సంకల్పానికి సహకరించాల్సిందిగా కోరడంతో దేవీశ్రీ తల్లిదండ్రులు అందుకు సమ్మతించారు.బిడ్డ ఆశయ సాధన సహకరించాలని భావించిన శ్రీనివాస్ దంపతులు సరేనన్నారు.
ప్రస్తుతం నేవీ శిక్షణ పూర్తి చేసుకున్న దేవీశ్రీ నేవీ పైలట్ అధికారిణిగా బాధ్యతలు స్వీకరించింది.ఆమె సాధించిన విజయం పట్ల అమెరికాలోని తెలుగు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
ఓ తెలుగమ్మాయి.ఇలాంటి బాధ్యతలు స్వీకరించడం యావత్ తెలుగుజాతికి గర్వకారణమైన విషయమని నాట్స్ ప్రశంసించింది.
దేవీశ్రీ భవిష్యత్‌లో ఎన్నో విజయాలు సాధించాలని నాట్స్ అకాంక్షించింది.