ఉత్తరాదిన బలమైన శక్తిగా అవతరించిన బీజేపీ.దక్షిణాదిన పాగా వేయాలని ఎంతో ఉబలాటపడుతోంది.
సౌత్‌లో ఒక్క కర్ణాటక మినహా ఏ రాష్ట్రంలోనూ బీజేపీకి పెద్దగా ఆదరణ లేకుండా పోయింది.ఇకపోతే వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా దక్షిణాదిన కొన్ని లోక్‌సభ స్థానాలను తన ఖాతాలో వేసుకోవాలని బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది.
అందుకోసం ఇప్పటి నుంచే భారీగా కసరత్తులు చేస్తోంది.కర్ణాటక తర్వాత తెలంగాణలో బీజేపీ పాగా వేయడానికి ఇప్పుడిప్పుడే కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతోంది.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కమలనాధులు ఉవ్విళ్లూరుతున్నారు.
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించింది.
ఒకవేళ అధికారంలోకి వచ్చిన ఈ సారి బీజేపీకి ఎంపీ సీట్లు తగ్గే అవకాశం లేకపోలేదు.కేంద్రంలో అధికారంలోకి ఏ పార్టీ రావాలనేది యూపీ డిసైడ్ చేస్తుంది.ప్రస్తుతం అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉండటంతో తిరిగి బీజేపీకే అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు చెబుతున్నాయి. 80 పార్లమెంటు స్థానాలున్న యూపీలో కనీసం 50కు పైగా బీజేపీ సాధించినా.
ఉత్తరాధిలో కొంతమేర సీట్లు తగ్గితే వాటిని దక్షిణాధిన కవర్ చేసుకోవాలని మోడీ షా ద్వయం నిర్ణయించినట్టు సమాచారం.
సౌత్‌లో మొన్నటివరకు కేంద్రానికి చేదోడు వాదోడుగా ఉన్న కేసీఆర్ ఒక్కసారిగా రివర్స్ అయ్యాడు.
కేసీఆర్‌తో మిత్రుత్వం ఉంటే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం చాలా కష్టం.ప్రత్యర్థిగా ఉంటేనే లెక్కలు తేల్చుకోవటం చాలా ఈజీ.ఈ కారణంతోనే కేసీఆర్ మీద పోరుకు సై అని చెప్పటమే కాదు.రానున్న ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో తమ సత్తా చాటాలన్న పట్టుదలతో కమలనాధులు ఉన్నట్లు తెలుస్తోంది.
మిగిలిన పార్టీ అధినేతలతో పోలిస్తే టీఆర్ఎస్ అధినేత వ్యవహారశైలి భిన్నంగా ఉంటుందని బీజేపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు చెబుతారు.

ఈ నేపథ్యంలోనే శత్రువు శత్రువు మిత్రుడన్న నానుడికి తగ్గట్లు కేసీఆర్‌కు అసలు పడని చంద్రబాబును తమతో జట్టు కట్టేలా చేసేందుకు మోడీ- షా వ్యూహ రచన చేస్తున్నారు.తెలంగాణలో కేసీఆర్‌ను దెబ్బ తీయాలన్న వ్యూహానికి అవసరమైన మందీ మార్బలం సమకూరుతుందని భావిస్తున్నారు.2019 ఎన్నికల్లో చంద్రబాబు ఓటమికి కేసీఆర్ కీలకంగా వ్యవహరించినట్లు చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం.అందుకే రాబోయే ఎన్నికల్లో చంద్రబాబును ఉపయోగించుకుని కేసీఆర్ను ఓడించడానికి బీజేపీ పథక రచన చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.చంద్రబాబు హైదరాబాద్‌లోని సెటిలర్స్ సపోర్టు ఇప్పటికీ ఉంటుంది.ఈసారి బాబుతోనే కేసీఆర్‌కు చెక్ పెట్టాలని తాజా మీటింగులు అందుకు ఊతం ఇస్తున్నాయి.