ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే స్ఫూర్తితో ప్రజా సమస్యలపై ఉద్యమిద్దామని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు .పార్టీ జిల్లా కమిటీ , మండల కార్యదర్శులు , హోల్టైమర్స్ శుక్రవారం సాయంత్రం యర్రా శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించిన వర్చువల్ మీటింగ్లో ఆయన మేడే ఆవశ్యకత , ఉత్సవాల నిర్వహణపై వివరించారు .
నరేంద్రమోడీ నాయకత్వంలో కొనసాగుతున్న నయా ఉదారవాద విధానాల దాడి నుంచి కార్మిక వర్గాన్నే కాకుండా రైతాంగాన్నీ , మొత్తం ప్రజానీకాన్ని కాపాడాల్సిన అవసరం ఉందన్నారు .కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు .ప్రజా సమస్యలపై మే 15 వ తేదీ వరకూ ఉ ద్యమించాలని పిలుపునిచ్చారు .ఆకాశాన్నంటుతున్న ధరలు , పెరుగుతున్న నిరుద్యోగం , అసమానతలు , ఆకలి , దారిద్య్రం , పీడన , నిరంకుశత్వం నుంచి విముక్తి కల్పించే ప్రత్యామ్నాయ విధానాల కోసం మరింత ఐక్యత , పట్టుదలతో సుదీర్ఘపోరాటాలకు కార్మికవర్గాన్ని సంసిద్ధం చేయాల్సిన బాధ్యత వామపక్ష , ప్రజాతంత్ర శక్తులపై ఉందన్నారు .ఆదివారం గ్రామ గ్రామాన మేడే జెండాను ఎగురవేయాలన్నారు .8 గంటల పని విధానం కోసం లక్షలాది మంది కార్మికులు రక్తం చిందించి నెత్తుటి జెండాలు ఎగురవేసిన రోజు మేడే అన్నారు .అమరవీరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని ఊరూరా మేడే నిర్వహించాలన్నారు .కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ , డీజిల్ , గ్యాస్ , నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారాల మీద భారాలు వేస్తుంటే విద్యుత్ , రవాణా చార్జీల పెంపుతో రాష్ట్ర ప్రభుత్వం మరోవైపు ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు .కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు .ప్రజా సమస్యలపై గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉద్యమాలు చేపట్టాలన్నారు .బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక , ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు మతోన్మాద చర్యలను తిప్పికొట్టాలని కోరారు .ఈ సమావేశంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు , మండల కార్యదర్శులు , హెూల్టైమర్లు పాల్గొన్నారు .