ప్రస్తుతం తెలంగాణలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలను బేరీజు వేసుకుంటూ జాతీయ రాజకీయాల్లోనూ చక్రం తిప్పేందుకు గత కొంతకాలంగా టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.బిజెపికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో కొత్త పార్టీని ఏర్పాటు చేసి అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనిలో భాగంగానే దేశ వ్యాప్తంగా తాము స్థాపించబోయే పార్టీకి ఆదరణ లభించే విధంగా వివిధ రాష్ట్రాల పర్యటనలు చేపడుతూ, ప్రజలను వివిధ ప్రాంతీయ పార్టీలను ఆకర్షించే ప్రయత్నాల్లో కేసీఆర్ ఉన్నారు.ఇక దసరా రోజున కొత్త జాతీయ పార్టీ పేరును కేసీఆర్ ప్రకటించబోతున్నట్లు తెలుస్తోంది.
అయితే ఆ పార్టీ పేరును భారత్ రైతు సమితి అని పెట్టబోతున్నట్లు లీకులు బయటకు వచ్చాయి.
అయితే పేరు విషయంలో ఇంకా సరైన క్లారిటీ ఆ పార్టీ నాయకులకు రాలేదు.
అయినా కొత్త జాతీయ పార్టీ అవసరం ఉందంటూ గత కొద్ది రోజులుగా టిఆర్ఎస్ కీలక నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు పదేపదే ప్రస్తావిస్తున్నారు.ప్రస్తుతం దేశంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కొత్త పార్టీ ఉండాల్సిందే అంటూ టిఆర్ఎస్ నాయకులు ప్రకటిస్తున్నారు.
అయితే కెసిఆర్ స్థాపించబోయే కొత్త జాతీయ పార్టీ ఏ విధంగా ఉండబోతుంది ? ఆ పార్టీ గుర్తు ఏమిటి? జెండా రంగు ఏమిటి పార్టీ పేరు ప్రకటన ఎప్పుడు ఉండబోతోంది ? ఇలా అనేక అంశాలపై జనాల్లోనూ రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తి నెలకొంది అయితే దీనికి సంబంధించి కొన్ని లీకులు బయటకు వచ్చాయి.టిఆర్ఎస్ పార్టీ జెండాలో ఉన్న గులాబీ రంగును, అలాగే ఆ పార్టీ గుర్తు అయిన ‘ కారు ‘ గుర్తును జాతీయ పార్టీకి ఉండేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు ఈ గుర్తు కేటాయించకపోతే , ఆ గుర్తు నే తీసుకోవాలని అసలు ఆ గుర్తు ఇప్పటివరకు ఏ పార్టీకైనా కేటాయించారా లేదా అనే విషయాలపై టిఆర్ఎస్ నేతలు ఆరా తీస్తున్నట్లు సమాచారం.ఎట్టి పరిస్థితుల్లోనూ కారు గుర్తునే తమ జాతీయ పార్టీ గుర్తుగా తీసుకోవాలనే పట్టుదలతో కేసీఆర్ ఉన్నారట.దీనికి సంబంధించి కొంతమంది పార్టీ నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.తెలంగాణలో తమకు బాగా కలిసి వచ్చిన కారు గుర్తును, గులాబీ రంగు జెండాను జాతీయ పార్టీలో ఉండేలా చూసుకుంటే అక్కడ కూడా తమకు సక్సెస్ దక్కుతుంది అనే సెంటిమెంట్ లో అధినేత కేసిఆర్ ఉన్నారట.