మనం ప్రతి రోజు తీసుకొనే ఆహారంలో ఎన్నో విటమిన్స్,మినరల్స్ ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే.అలాంటి ముఖ్యమైన పోషకాల్లో పొటాషియం కూడా ఒకటి.
ఈ పొటాషియం అనేది మన శరీరంలో కండరాల కదలికలకు, నరాలు ఆరోగ్యంగా ఉండాలన్నా, ద్రవాలు నియంత్రణలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.ఈ రోజుల్లో సరైన పోషకాహారం తీసుకోకపోవటం వలన చాలా మందిలో పొటాషియం లోపం వస్తుంది.
అసలు పొటాషియం లోపిస్తే ఏమి జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
నీరసం,అలసట ఎక్కువగా తరచుగా అనిపిస్తూ ఉంటే పొటాషియం లోపించిందని గుర్తించాలి.
రక్తంలో పొటాషియం స్థాయిలు తగ్గితే కండరాలు బలహీనంగా మారి అలసట కలుగుతుంది.ఏ పని చేయాలన్న నిస్సత్తువుగా ఉండి ఆసక్తి అనేది అసలు ఉండదు.
రక్తంలో పొటాషియం లోపించటం వలన కండరాలు బలహీనం అయ్యి విపరీతమైన నొప్పులు వస్తాయి.
జీర్ణ వ్యవస్థ పనితీరు మందగించి తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాక గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి.
రక్తంలో పొటాషియం లోపించినప్పుడు ఆ ప్రభావం గుండె మీద కూడా పడుతుంది.గుండె కొట్టుకొనే విధానంలో హెచ్చుతగ్గులు ఉంటాయి.ఇది గుండె సమస్యలకు దారి తీస్తుంది.
శరీరంలో పొటాషియం లోపిస్తే చేతులు, అరచేతులు, కాళ్లు, పాదాల్లో సూదుల్తో గుచ్చినట్టు ఉండి ఒక్కసారి స్పర్శ కూడా తెలియదు.
పొటాషియం సమృద్ధిగా లభించే బంగాళాదుంప , బీన్స్, అవకాడో, అరటిపండ్లు, పాలు, చిరు ధాన్యాలు, బ్రెడ్, వాల్ నట్స్, పాస్తా, యాపిల్, కివీ, ఆకుపచ్చని కూరగాయలు వంటి ఆహారాలను తీసుకుంటే పొటాషియం లోపాన్ని అధికమించవచ్చు.