డొనాల్డ్ ట్రంప్(Donald Trump) అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అక్కడ అక్రమంగా నివసిస్తున్న విదేశీయులను దేశం నుంచి బహిష్కరిస్తున్న సంగతి తెలిసిందే.వీరిలో భారతీయులు(Indians) కూడా ఉన్నారు.
ఇప్పటికే పలువురిని విడతల వారిగా ఇండియాకు తరలించింది అమెరికా.దీనిపై భారతీయులు తీవ్రంగా మండిపడుతున్నారు.
భవిష్యత్తులో బహిష్కరణకు గురయ్యేవారు ఎంత మంది ఉంటారో తెలియదని విశ్లేషకులు చెబుతున్నారు.ట్రాన్సాక్షనల్ రికార్డ్స్ యాక్సెస్ క్లియరింగ్‌హౌస్ (టీఆర్ఏసీ) అందించిన తాజా ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ డేటాపై నార్త్ అమెరికన్ పంజాబీ అసోసియేషన్ (ఎన్ఏపీఏ) (NAPA)ఆందోళన వ్యక్తం చేసింది.
ఫిబ్రవరి 9 నాటికి ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ (ఐసీఈ) (
(ICE))అమెరికా వ్యాప్తంగా దాదాపు 41,169 మందిని నిర్బంధ కేంద్రాలలో ఉంచింది.

ఎన్ఏపీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సత్నామ్ సింగ్ చాహల్ మాట్లాడుతూ.ఐసీఈ కస్టడీలో ఉన్న వారిలో 54.7 శాతం మంది (22,538 మంది) ఖైదీలకు ఎలాంటి నేర చరిత్ర లేదని తెలిపారు.ట్రాఫిక్ ఉల్లంఘనలతో సహా చిన్న నేరాలకు ఎంతో మందిని అదుపులోకి తీసుకున్నారని చాహల్ మండిపడ్డారు.2025 ఆర్ధిక సంవత్సరంలో అత్యధిక సంఖ్యలో ఐసీఈ ఖైదీలు ఉన్న రాష్ట్రంగా టెక్సాస్ గుర్తించబడింది.ఐసీఈ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (సీబీపీ) కలిసి 2025 జనవరిలో 21,959 మందిని అరెస్ట్ చేశాయి.మిస్సిస్సిప్పిలోని నాట్చెజ్‌లోని ఆడమ్స్ కౌంటీ డిటెన్షన్ సెంటర్ 2025 ఆర్ధిక సంవత్సరంలో ఐసీఈ ఖైదీలకు అతిపెద్ద నిర్బంధ కేంద్రంగా అవతరించింది.

ఐసీఈ ఆల్టర్నేటివ్స్ టు డిటెన్షన్ (ఏటీడీ) కార్యక్రమాలు ప్రస్తుతం 1,88,304 కుటుంబాలను , ఒంటరి వ్యక్తులను పర్యవేక్షిస్తున్నాయి.శాన్‌ఫ్రాన్సిస్కో రీజినల్ కార్యాలయం అత్యధిక మందిని పర్యవేక్షిస్తోంది.మొత్తం ఖైదీలలో భారతీయ ఖైదీల సంఖ్య ఎంత అన్నది ఇంకా తెలియరాలేదని సత్నామ్ సింగ్ చాహల్ తెలిపారు.అయితే వలస సంక్షోభంలో ఖైదీల ఇబ్బందులను తగ్గించడంలో నిర్బంధ కేంద్రాలు నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.