ఏపీకి ప్రత్యేక హోదా.ఈ విషయంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసినంత స్థాయిలో మరెవరు చేయలేదనే చెప్పాలి.
వైసిపి ప్రతిపక్షంలో ఉండగా ఇదే విషయంపై పెద్ద ఎత్తున పోరాటం చేసింది.ధర్నాలు, ఉద్యమాలు చాలానే చేసింది.
ప్రత్యేక రైళ్లలో ఢిల్లీ కి పార్టీ నాయకులను తీసుకువెళ్లి ప్రత్యేక హోదా కోసం నిరసన కార్యక్రమాలు ఎన్నో జగన్ చేయించారు.అంతేకాకుండా తమ ఎంపీలకు పదవీకాలం ఇంకా సంవత్సరం ఉండగానే ప్రత్యేక హోదా కోసం వారితో మూకుమ్మడి రాజీనామాలు చేయించి దేశవ్యాప్తంగా ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని హైలెట్ చేశారు.
అయినా అప్పటి నుంచి కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో స్పందించడం లేదు.ప్రత్యేక హోదా కాదు ప్యాకేజీ ఇస్తామని అప్పట్లో ప్రకటించింది.
ఈ విషయాన్ని ఏపీలో అప్పట్లో అధికార పార్టీగా ఉన్న టిడిపి సైతం మద్దతు పలికింది.
ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటేనే బెటర్ అన్నట్టుగా అప్పటి సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు.
తరువాత పరిణామాల్లో బిజెపి టిడిపి దూరమవడం వైసీపీకి బీజేపీ దగ్గరవడం ఎన్నికల్లో సహకరించడంతో జగన్ డిమాండ్లను అధికారంలోకి వచ్చాక బీజేపీ తీరుస్తుందని అంతా భావించారు.కానీ ఇప్పటికీ బిజెపి వైఖరిలో మార్పు కనిపించడం లేదు.ఈ విషయం మరోసారి రుజువైంది.14వ ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేము అంటూ కేంద్రం ప్రకటించింది.ఈ మేరకు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.హోదా ఇవ్వకపోయినా, ఏపీ అభివృద్ధికి బిజెపి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.

బిజెపి రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయనం అంటూ ప్రకటించారు.పార్లమెంట్ సమావేశాలకు ముందు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో అఖిలపక్ష సమావేశం జరిగింది.ఈ భేటీకి వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి హాజరై ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేశారు.వీటితోపాటు ఏపీ కి సంబంధించి తొమ్మిది ప్రధాన సమస్యలను పరిష్కరించ వలసిందిగా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యలపై స్పందన ఎలా ఉన్నా ఇప్పుడు ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మాత్రం కేంద్రం తన వైఖరిని స్పష్టంగా తెలియజేయడంతో ఇప్పుడు వైసీపీ రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.హోదా విషయంలో కేంద్రంపై పోరాటం చేయాలా లేదా అనే విషయంపై పార్టీలో చర్చ జరుగుతోందట.