ఏపీలో అధికార పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి సీఎం జగన్ సరికొత్త రీతిలో ముందుకు వెళ్తున్నారు.తాను ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడంతో పాటు, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండే విధంగా జగన్ ప్లాన్ చేస్తున్నారు.
అలాగే పార్టీలకు అతీతంగా, ప్రజా సంక్షేమ పథకాలు అందరికీ అందే విధంగా జగన్ ప్లాన్ చేసుకున్నారు.ఈ ఫార్ముల సక్సెస్ కూడా అవుతున్నట్టుగానే జగన్ కు ఫీడ్ బ్యాక్ అందుతోంది.
గతంలోని ఏ ప్రభుత్వాల్లో చూసుకున్నా, ఏ ప్రభుత్వ పథకం అయినా లబ్ధిదారులకు అందాలంటే నాయకులపై ఆధారపడి ఉండేది.ఇక పార్టీల వారీగా ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కానీ, మరేదయినా కానీ పార్టీ నాయకుల దయా దాక్షణ్యాలపైనే ఆధారపడి ఉండేది.
కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ విధానాన్ని పూర్తిగా పక్కనపెట్టేశారు.అంటే పార్టీ నాయకులపై ఆధారపడితే వారు తాము అనుకున్న విధంగా చేయలేరనే ఉద్దేశంతో పూర్తిగా అధికారుల మీద బాధ్యతలు పెట్టి, తాను అనుకున్న లక్ష్యాలను సక్సెస్ ఫుల్ గా అమలు చేసుకోగలిగారు.
ఏడాది పాలనలో జగన్ తాను ఏం చేయాలనుకున్నానో అంతకంటే ఎక్కువ చేసి చూపించారు.ఈ విషయంలో అధికారులు పాత్ర చాలా ఎక్కువే.అయినా, క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధుల పెత్తనం ఎక్కువగా ఉంటూ వస్తుండడం, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించడం వంటి కారణాల వల్ల ప్రభుత్వానికి క్రెడిట్ రావడంలేదని గ్రహించిన జగన్ అధికారులకు పూర్తిగా స్వేచ్ఛను ఇచ్చేసారు.మీరు ఎవరి మాట వినొద్దు, మీ వెనక నేనున్నానని, ఏం జరిగినా నేను చూసుకుంటానని, మీరు ఎక్కడా రాజీపడకుండా చిత్తశుద్ధితో ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకు వెళ్ళాలి అంటూ భరోసా ఇచ్చారట.
తాజాగా జగన్ ఈ ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

ముఖ్యంగా ప్రభుత్వానికి ఇసుక, మద్యం వ్యవహారాలు చెడ్డ పేరు తీసుకువస్తున్నాయని గ్రహించిన జగన్ ఆ విషయంలో ఎక్కడా రాజీ పడొద్దు అని అధికారులకు గట్టిగానే సూచించారు.ప్రజాప్రతినిధుల జోక్యం లేకుండా వ్యవహరించాలని, మీ విధులకు ఎవరు అడ్డం పడినా మీ వెనుక నేనున్నానని చెప్పాలంటూ వారికి భరోసా ఇచ్చారు.అలాగే అక్రమ మద్యం సరిహద్దు రాష్ట్రాల నుంచి ఏపీ లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, ఏపీలో మద్యపాన నిషేధం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంటే, అక్రమ మద్యం ఏరులై పడుతుంటే ఎలా అంటూ జగన్ అధికారులను ప్రశ్నించారు.
ఈ విషయాలపై మీరు కఠినంగా ఉండాలని, మీకు ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటాను పూర్తిగా అధికారులకు స్వేచ్ఛను కల్పించారు.తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయం పై పార్టీ నాయకులు, అధికార వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే పార్టీ క్యాడర్ జగన్ తమను పట్టించుకోవడం లేదనే బాధ లో ఉండగా, ఇప్పుడు అధికారులకు మరింత స్వేచ్ఛ కల్పించడం చర్చనీయాంశమవుతోంది.