రాజకీయాల్లో ఒక్కొసారి అన్నీ ఉండి అనుకున్న స్థాయిలో బలం ఉండి కూడా సమన్వయం లేకపోతే ఓటమి చూడాల్సిందే.ఇప్పుడు ఏపీలో అక్కడ వైసీపీ పరిస్థితి అలాగే ఉందంటున్నారు విశ్లేషకులు.
ఏపీలోని రాజమండ్రి తూర్పు గోదావరి జిల్లాలో చైతన్యవంతమైన ప్రాంతం.అక్కడ ఏపీలో అన్ని చోట్ల మాదిరిగానే జగన్ వేవ్ బలంగా వీచింది.
అయినా సరే 2019 ఎన్నికల్లో రాజమండ్రి రూరల్.అర్బన్ రెండు సీట్లూ కోల్పోయింది.బలమైన నాయకులు ఉండి కూడా పార్టీ పట్టుకోల్పోయింది.కారణం అక్కడి నేతల్లో సమన్వయం లేకపోవడమే అంటున్నారు.
దీంతో ప్రత్యర్థులు సునాయాసంగా రెండు సీట్లను కైవసం చేసుకున్నారు.అయితే గత ఎన్నికల్లో ఓడినా అక్కడ వైసీపీ పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదని అంటున్నారు.
ఇప్పటికీ అక్కడి నేతల్లో వర్గపోరు నడుస్తోందని అంటున్నారు.రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో వైసీపీ పరిస్థితి ఇలా ఉంది.
ఇద్దరూ మార్పు తేలేకపోయారా
ఇక వైసీపీ అధినాయకత్వం తన వంతుగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూ వచ్చింది.మొదట గోదావరి జిల్లాల ఇంచార్జిగా జగన్ సొంత బాబాయ్ వైవీ సుబ్బారెడ్డిని నియమించింది.
ఆయన పార్టీలో ఎలాంటి మార్పూ తీసుకురాలేకపోయారు.పార్టీ పటిష్టతకు కృషి చేయలేకపోయారు.
ఇక ఆయన్ని మార్చి మిధున్ రెడ్డికి బాధ్యతలు అప్పగించినా కూడా పరిస్థితిలో మార్పు రాలేదు.ఆయన కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేశారని అంటున్నారు.
ఇక వైసీపీ తరఫున ఉన్న నాయకులు కలహాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు.ఇంత పెద్ద నగరంలో పార్టీకి ఒక ఆఫీస్ అంటూ లేదు.
లక్కీగా ఇలాంటి టైమ్ లో కూడా ఎంపీ సీటుని మార్గాని భరత్ గెలుచుకున్నారు.దాంతో ఆయన ఆఫీస్ లో మీటింగ్స్ జరుగుతాయి.
లేకపోతే రూరల్ ఇంచార్జి ఆఫీస్ లో పెట్టుకుంటున్నారు.

సర్వేలు నెగిటివ్ గా…!
ఇక మేయర్ ఎన్నికలు రాజమండ్రికి బకాయి ఉన్నాయి.మరో ఇరవై నెలలలో సార్వత్రిక ఎన్నికలు తోసుకువస్తున్నాయి.అయినా కానీ నాయకత్వ సమస్య అలా పట్టిపీడిస్తోంది.
మేయర్, ఎమ్మెల్యే ఎన్నికలకు కూడా పార్టీ అభ్యర్థులను ఈ రోజుకూ ఖరారు చేయలేదు.ఇటీవల నిర్వహించిన అనేక సర్వేలు కూడా పార్టీకి ఆశలు గల్లంగయ్యేలా ఉన్నాయి.
మరో వైపు చూస్తే మేయర్ ఎన్నికల కోసం ఇప్పటికే ముగ్గురు సమన్వయకర్తలను పార్టి మార్చి అయోయమయం క్రియేట్ చేసిందటున్నారు.వైసీపీకి ఇక్కడ గట్టి నాయకులే ఉన్నారు.
వారిలో రౌతు సూర్య ప్రకాశరావు, శివరామ సుబ్రహ్మణ్యం, ఆకుల సత్యనారాయణ, కోడి ప్రవీణ్, అనసూరి పద్మలత, పంతం కొండల రావు, నక్కా శ్రీ నగేష్, జక్కంపూడి గణేష్ అంతా బలమైన వారే.కానీ సమన్వయం లేకుంటే ఎంతమంది ఉన్నా ఫలితం ఇలాగే ఉంటుందంటున్నారు.
అయితే వీళ్లపై పార్టీ అధిష్టానానికి కూడా నమ్మకం లేదనే వాదనలు ఉన్నాయి.ఏపీలో కీలకమైన రాజమండ్రి విషయంలో వైసీపీ ఇప్పటికైనా దృష్టి పెట్టాలి అంటున్నారు.
సీఎం జగన్ నేరుగా ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే 2024లో ఫ్యాన్ తిరిగే అవకాశం ఉందంటున్నారు.మరి అధినేత ఎలాంటి మార్పులు చేస్తాడో చూడాలి.