ఈ రోజు అసెంబ్లీలో అధికార పార్టీ నాయకుల వ్యవహారశైలిపై టిడిపి అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.టిడిపిని టార్గెట్ చేసుకుంటూ అధికార పార్టీ సభ్యులు దురుసుగా మాట్లాడటాన్ని ఆయన తప్పుబట్టారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న గర్వం బాగా ఎక్కువవడంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.అలాగే ఏపీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పద్ధతి లేకుండా ప్రవర్తిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.
బుధవారం సాయంత్రం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.ప్రజా సమస్యలపై తెలుగుదేశం పార్టీ ఆందోళన చేయాల్సిన పరిస్థితి ప్రతిరోజు నెలకొంటోందని వాపోయారు.
రాష్ట్రంలో ఉల్లిపాయల కొరత తీవ్రంగా ఉండటంతో ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారని ఇప్పటి వరకు ఇసుక కొరతతో ఇదే రకమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారని బాబు విమర్శించారు.ప్రజలు కష్టాల్లోఉన్నా సరే తనకేమీ పట్టనట్టు అధికార పార్టీ వ్యవహరిస్తోందని, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ కు తమ ఎమ్మెల్యేలను చూసుకుని బాగా గర్వం పెరిగిపోయిందని, ఆ గర్వంతోనే ఇష్టమొచ్చినట్లుగా రెచ్చిపోతున్నారని విమర్శించారు.
అసెంబ్లీలో తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని, తమకు మాట్లాడే అవకాశం ఇస్తే వాస్తవాలు ఎక్కడ బయటకు వస్తాయో అని ప్రభుత్వానికి భయం పట్టుకుందని చంద్రబాబు విమర్శలు చేశారు.
అగ్రిగోల్డ్ బాధితులకు తామే న్యాయం చేశామని, వైసీపీ కార్యకర్తలకు ప్రజాధనాన్ని దోచి పెట్టేందుకే వాలంటీర్ల వ్యవస్థను తీసుకువచ్చారని బాబు విమర్శలు గుప్పించారు.