పరిస్థితులకు అనుగుణంగా రాజకీయాలను మలుపు తిప్పడంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం ఏంటో అందరికీ తెలిసిందే.విపత్కర పరిస్థితులను కూడా తనకు, తన పార్టీకి అనుకూలంగా మార్చుకుని మైలేజ్ పొందడంలో బాబు ఎప్పుడు ముందే ఉంటారు.
ఇది అనేక సందర్భాల్లో రుజువైంది.ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది.
ఈ సమయంలో అధికార పార్టీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.ఒకవైపు పూర్తిగా ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.
అలాగే భారీ ఎత్తున నిధులను కరోనా వ్యవహారంలో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఉంది.ఈ అన్ని వ్యవహారాలతో వైసీపీ ప్రభుత్వం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది.
మరోవైపు అధికార పార్టీ నాయకులు ప్రభుత్వం అందించే సహాయాన్ని ప్రజలకు అందించే క్రమంలో రోడ్లపైకి విచ్చలవిడిగా గుంపులు గుంపులుగా వస్తుండటాన్ని టిడిపి తప్పు పడుతోంది.ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ ఏపీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి వైసిపి నాయకులు కారణమంటూ ఆరోపణలు చేస్తోంది టిడిపి.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రస్తుతం ఏపీ లో లేరు.ఆయన హైదరాబాదులో లాక్ డౌన్ కి ముందే ఉండిపోయారు.అయితే అక్కడ తీరిగ్గా విశ్రాంతి తీసుకోకుండా పాలిటిక్స్ ఫ్రమ్ హోమ్ అంటూ సరికొత్త రాజకీయాలకు తెర తీశారు.నిత్యం పార్టీ శ్రేణులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా, టిడిపిలో కొత్త ఉత్సాహం రేకెత్తించే విధంగా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్న పరిస్థితుల్లో ప్రజలకు నిత్యావసరాలు వివిధ సహాయాలు అందించడానికి తప్ప బయటకు వచ్చేందుకు అనుమతి లేకపోవడంతో ఏపీ రాజకీయం వేడెక్కించడంతో పాటు వైసిపి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగే విధంగా పార్టీ నాయకులతో చంద్రబాబు దీక్షలు చేయిస్తున్నారు.

టీడీపీ నాయకులు ఎవరికి వారు వారి ఇంటి వద్దే దీక్షలు నిర్వహించేలా బాబు ప్లాన్ చేశారు.ప్రస్తుతం వర్క్ టూ హోమ్ అంటూ ఉద్యోగస్తులు తమ ఇంటి నుంచే విధులు నిర్వర్తించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా, అదే విధానాన్ని టిడిపి నాయకులు కూడా పాలిటిక్స్ ఫ్రమ్ హోమ్ నిర్వహించేలా చంద్రబాబు ప్లాన్ చేశారు.దీనిలో భాగంగా అనేక ప్రజా సమస్యలు, కరోనా ఇబ్బందుల కారణంగా ప్రజలు పడుతున్న అవస్థలు వీటన్నింటిపై పార్టీ నాయకులతో వారి ఇంటి నుంచే దీక్షలు చేస్తున్నారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాల్సిందిగా వారిచే డిమాండ్ చేస్తున్నారు.అయితే నాయకులు అందరూ ఒకే అంశంపై దీక్షలు చేయకుండా, స్థానిక పరిస్థితులకు అనుగుణంగా, స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ దీక్షలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.
కొద్దిరోజులుగా అదే పనిలో నిమగ్నమై ఉన్నారు తెలుగు తమ్ములు.ఈ విధానం ద్వారా సొమ్ములు ఆదా అవ్వడంతో పాటు ప్రజల్లో టీడీపీకి ఆదరణ పెరిగింది అని చంద్రబాబు నమ్ముతున్నారు.