ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ భవిష్యత్తు గందరగోళంలో పడింది.జగన్మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగానే రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం టెండర్లను రద్దు చేశారు.
ఆ తర్వాత రివర్స్ ప్రక్రియలో భాగంగా మేఘాకు పనులు అప్పగించారు.రాష్ట్రంలో టెండర్లు రివర్స్ అయ్యాయి.
అటు కేంద్రం మాత్రం ఈ ప్రాజెక్ట్‌పైనే రివర్స్ అయినట్లు కనిపిస్తోంది.
పేరుకు ఇది జాతీయ హోదా ఉన్న ప్రాజెక్ట్ అయినా.
ఇప్పటి వరకూ కనీసం రాష్ట్రం చేసిన ఖర్చును కూడా కేంద్రం విడుదల చేయడం లేదు.పైగా కేంద్ర బడ్జెట్‌లోనూ ఈ ప్రాజెక్ట్ కోసం ఎలాంటి నిధులూ కేటాయించలేదు.
ప్రాజెక్ట్ పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని కేంద్రం ఇంకా అధికారికంగా గుర్తించనే లేదు.దీంతో ఆ సంస్థతో జలశక్తి శాఖ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు.
కానీ అందులోని సభ్యులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం జీతాలు చెల్లించాల్సి వస్తోంది.ఇప్పటి వరకూ పోలవరంపై రాష్ట్రం చేసిన ఖర్చులో రూ.6727 కోట్లు కేంద్రం తిరిగి ఇచ్చింది.మరో 5072 కోట్లు ఇవ్వాల్సి ఉన్నట్లు రాష్ట్ర అధికారులు తేల్చారు.ఇందులో రూ.1850 కోట్లు ఇస్తామని కేంద్ర జలశక్తి శాఖ రాష్ట్రానికి సమాచారం ఇచ్చింది.అయితే ఈ మొత్తం ఇవ్వడానికి కేంద్రం నానా కొర్రీలు వేస్తోంది.
2014కు ముందు చేసిన ఖర్చుకు కాగ్ ఆడిట్ నివేదిక ఇవ్వాలని తాజాగా కేంద్రం మరో మెలిక పెట్టింది.అంతేకాదు బడ్జెట్‌లో ప్రాజెక్ట్‌కు కేటాయింపులు లేవని, అందువల్ల నాబార్డు ద్వారా రుణం పొంది దానిని జలశక్తి శాఖ ద్వారా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి, అక్కడి నుంచి రాష్ట్రానికి ఇస్తామని కేంద్ర ఆర్థికశాఖ చెబుతోంది.ఓ జాతీయ ప్రాజెక్ట్‌కు బడ్జెట్‌లో కేటాయింపులు లేకపోవడంపై రాష్ట్రం అసంతృప్తి వ్యక్తం చేస్తోంది.
వచ్చే ఆర్థిక సంవత్సరానికైనా బడ్జెట్‌లో నిధులు కేటాయించేలా ఒత్తిడి తేవాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.ఇక ప్రాజెక్ట్‌కు సంబంధించిన సహాయ పునరావాస ప్యాకేజీపై కేంద్ర ఆర్థిక శాఖ పదే పదే అవే ప్రశ్నలు అడుగుతోంది.ఇటు పోలవరం ప్రాజెక్ట్ టెండర్లు, పనుల అప్పగింతలో అక్రమాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిటీ నిర్ధారించడంతో ఇదంతా తేలేవరకూ కేంద్ర ఆర్థిక శాఖ నుంచి నిధులు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.