జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొత్తగా రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టాడు.తన రాజకీయం అంతా రాజకీయాల కోసం కాదని, ప్రజలకోసం అంటూ పవన్ చెప్పుకొచ్చాడు.
ఆ తరువాత సీఎం అవుతా ఏపీ రాజకీయలను మలుపు తిప్పుతా అంటూ పవన్ గట్టిగా ప్రసంగాలు చేసాడు.ఎన్నికలకు తాము ఒంటరిగానే వెళ్తామని, ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని పవన్ చెప్పుకొచ్చాడు.
అయితే ఆ తరువాత బీఎస్పీ, సీపీఎం, సీపీఐ పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళాడు.పోలింగ్ అయిపోయింది.
పవన్ ఎన్ని సీట్లలో తన సత్తా చాటుతాడు అనే విషయం పక్కనపెడితే అసలు పవన్ ఎఫెక్ట్ కారణంగా ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీల ఓటు బ్యాంక్ ఎంతవరకు దెబ్బతింది అనే లెక్కలు ఇప్పుడిప్పుడే బయటకి వస్తున్నాయి.
పవన్ ఎఫెక్ట్ కారణంగా టీడీపీ కంచుకోటల్లో సైతం ఆ పార్టీ ఓటు బ్యాంకు భారీగా చీలినట్టు లెక్కలు బయటకి వస్తున్నాయి.
ముఖ్యంగా ఉభయగోదావరి జిల్లాలు, విశాఖలో జరిగిన పోలింగ్ సరళిని అంచనా వేస్తోన్న రాజకీయ పండితులు పవన్ ఎఫెక్ట్ కారణంగా బాగా దెబ్బతిన్నట్టు లెక్కలు బయటకి వస్తున్నాయి.ఈ ఎన్నికల్లో కనీసం జనసేన కారణంగా తెలుగుదేశం 15 నుంచి 20 నియోజకవర్గాల్లో ఓడిపోనుందని తెలుస్తోంది.
అలాగే టీడీపీ కనీసం 10 నుంచి 15 సీట్లలో మూడో స్థానానికి పడిపోనుందని కూడా ఆ నియోజకవర్గాల్లో ఇప్పటికే నివేదికలు టీడీపీ అధినేత చంద్రబాబుకి చేరినట్టు తెలుస్తోంది.జనసేన, వామపక్షాలు విడిగా పోటీ చెయ్యడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి తమకు లబ్ధి కలుగుతుందని ముందుగా చంద్రబాబు అంచనా వేశారు.
కానీ వాస్తవంలోకి వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది.

ప్రధానంగా ఉభయగోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నం జిల్లా, చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, తిరుపతి, మదనపల్లి అనంతపురం జిల్లాలో అనంతపురం టౌన్, ధర్మవరం కర్నూలు జిల్లాలో నంద్యాల లోక్‌సభ సెగ్మెంట్ పరిధిలో కొన్ని నియోజకవర్గాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించబోతోందట.ఇక ఉభయగోదావరి, విశాఖపట్నం జిల్లాలతో పాటు గుంటూరు జిల్లాలో రెండు నియోజకవర్గాలు, కృష్ణా జిల్లాలో రెండు చోట్ల, తూర్పుగోదావరి జిల్లాలో మరో నాలుగు చోట్ల టీడీపీ మూడో ప్లేస్‌లోకి వెళ్తుందని అనేక సర్వేల ద్వారా తేలుతోంది.మొత్తానికి పవన్ ఎఫెక్ట్ వైసీపీ కి ఉంటుంది అని టీడీపీ అధినేత భావిస్తే తిరిగి తిరిగి అది తెలుగుదేశానికే దెబ్బకొట్టినట్టయ్యింది.