రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District )లో నిర్వహించు స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ సమీకృత కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ( Collector Sandeep Kumar Jha ) మాట్లాడుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరుగుతాయని, జిల్లాలోని ప్రతి శాఖకు చెందిన అధికారులు , సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు వేడుకలకు తప్పనిసరిగా హాజరు కావాలని కలెక్టర్ తెలిపారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో వివిధ శాఖల ద్వారా స్టాళ్ల ప్రదర్శన చేపట్టాలని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తూ రూపోందించాలని అన్నారు.
దేశ భక్తి గేయాలతో కూడిన నృత్య ప్రదర్శనలు సాంస్కృతిక కార్యక్రమాల క్రింద ఏర్పాటు చేయాలని అన్నారు.స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నిర్వహణ వీలుగా జూనియర్ కళాశాల మైదానాన్ని పూర్తి స్థాయిలో శుభ్రం చేయాలని కలెక్టర్ సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సంబంధించి ఫ్లాగ్ ఏర్పాట్లు, గ్రౌండ్ సిద్దం చేయడం మొదలగు ఏర్పాట్లు పోలీస్ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలని అన్నారు.విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన సిబ్బంది ప్రశంసా పత్రాలు అందజేసేందుకు ప్రతిపాదనలు ఆగస్టు 14 లోపు పంపాలని కలెక్టర్ తెలిపారు.
ముఖ్య అతిథి సందేశం అందించేందుకు వీలుగా స్పీచ్ కాపీ రూపకల్పనకు ప్రతి శాఖ క్లుప్తంగా నివేదికలను డి.పి.ఆర్.ఓ కు అందజేయాలని అన్నారు.
స్వాతంత్ర్య వేడుకల వేదిక , సీటింగ్ ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని ప్రోటోకాల్ ప్రకారం సీటింగ్ ఏర్పాట్లు చేయాలని, దీనిని అప్రమత్తంగా నిర్వహించాలని అన్నారు.స్వాతంత్ర్య వేడుకలకు స్వాతంత్ర్య సమర యోధులను ఆహ్వానించాలని అన్నారు.
జిల్లాలో నేత కార్మికులు , ప్రాముఖ్యమైన వ్యక్తులు వేడుకలకు హజరయ్యేలా చూడాలని అన్నారు.ప్రతి ప్రభుత్వ శాఖ వారి కార్యాలయంలో వేడుకల నిర్వహించి, జిల్లాలో జరిగే వేడుకలకు హజరు కావాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పట్టణంలోని స్వశక్తి మహిళా సంఘాల ప్రతినిధులు హజరయ్యేలా మెప్మా అధికారులు చర్యలు తీసుకోవాలని, అదే విధంగా ఏఎన్ఏం ఆధ్వర్యంలో వైద్య బృందాలచే శిభిరాలు ఏర్పాటు చేయాలని అన్నారు.స్వాతంత్ర్య వేడుకల అవసరమైన మేర త్రాగు నీటి క్యాన్లు మున్సిపల్ కమిషనర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు.
ప్రభుత్వ ప్రాదాన్యత అంశాలకు సంబంధించి స్టాల్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.ఈ సమావేశంలో జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.