సూర్యాపేట జిల్లా: మోతె మండల పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా మారింది.ఈ మండలం గతంలో సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఉండేది.
నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా కోదాడ పరిధిలోకి తెచ్చారు.అప్పటి నుండి అధికారిక కార్యక్రమాలకు సూర్యాపేట,రాజకీయ అంశాలకు కోదాడకు వెళ్లాల్సిన విచిత్ర పరిస్థితి నెలకొందని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే మోతె మండల కేంద్రంలోని మీసేవలో గత సంవత్సరం వరకు ఆధార్ సెంటర్ ఉండేది.ఇక్కడ ఎత్తేసి చివ్వేంలలో ఏర్పాటు చేయడంతో ఆధార్ కార్డు నమోదు చేసుకోవాలన్నా, మార్పులు చేర్పులు చేయాలన్నా చివ్వేంల లేదా సూర్యాపేటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అన్నింటికీ ఆధారంగా ఆధార్ కార్డు మారిన నేపథ్యంలో ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తప్పనిసరైంది.ప్రభుత్వ పథకాలు పొందాలన్నా, ఇతర గుర్తింపు పత్రాలు, విద్యార్థుల పై చదువులకు, చివరికి ప్రభుత్వ దవాఖానకు,ప్రస్తుతం మహిళలు ఆర్టీసీ బస్సు ఎక్కాలన్నా ఆధార్ అవసరం తప్పనిసరి అయింది.
ఇంతటి ప్రాధాన్యతను సంతరించుకున్న ఆధార్ కార్డులో మార్పులు చేర్పులుచేసుకోవడానికి, కొత్తగా పొందడానికి,ఫోన్ నెంబర్ లింక్ చేసుకోవడానికి అందుబాటులో ఆధార్ సెంటర్ లేక అనేక అవస్ధలు పడుతున్నారు.
తీరా అంత దూరం వెళ్ళాక ఆధార్ కేంద్రాలు రద్దీగా ఉండడంతో చిన్నపిల్లల తల్లులు,వృద్దులు,వికలాంగులు ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి మోతె మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ ను పునరుద్ధరించాలని మండల ప్రజలు కోరుతున్నారు.ఏడాది కాలంగా ఆధార్ సెంటర్ లేక ఇబ్బంది పడుతున్నామని సిరికొండ గ్రామానికి ఉప్పుల చంద్రశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మోతె మండలంలో 29 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.సుమారు 50 వేల పై చిలుకు జనాభాను కలిగి ఉంది.
మండల కేంద్రంలో ఆధార్ సెంటర్ లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నాం.ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మోతెలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయాలి.