అనంతపురం కలెక్టరేట్‌లో( Anantapuram Collectorate ) ఓ రెవెన్యూ అధికారి( Revenue Officer ) నిర్వహించిన పని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ఓ కీలక సమావేశంలో పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మలోల తన సెల్‌ఫోన్‌లో రమ్మీ ఆడుతూ కెమెరాకు చిక్కారు.
ఈ ఘటన కలెక్టరేట్ ఆవరణంలోనే ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ ఛైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అధ్యక్షతన జరిగిన సమావేశంలో చోటుచేసుకుంది.ఈ సమావేశానికి అనంతపురం జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్, ఎస్పీ జగదీష్, అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న, ఇతర ప్రముఖ అధికారులు హాజరయ్యారు.
వీరు ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు, అభిప్రాయాలు తెలుసుకుంటున్న సమయంలో డీఆర్వో మలోల తమ పని చేసుకోవాల్సింది పక్కన పెట్టి తన ఫోన్‌లో రమ్మీ( Rummy ) ఆడడం కెమెరాలో స్పష్టంగా కనిపించింది.ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అయ్యింది.
సమావేశం జరుగుతుండగా, హాల్‌లో వందలాది ప్రజలు, అధికారులు, మీడియా ప్రతినిధులు ఉన్నా, డీఆర్వో( DRO ) మాత్రం తాపీగా రమ్మీ ఆడడంలో తలమునకలయ్యారు.ఈ దృశ్యాలు మీడియా కంటపడడంతో వీడియో క్షణాల్లో వైరల్‌గా( Viral Video ) మారింది.వీడియో చూసిన అనంతపురం జిల్లా కలెక్టర్ ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు.అలాగే డీఆర్వో మలోలకు వివరణ కోరుతూ నోటీసులు జారీ చేశారు.
మరోవైపు ఈ ఘటనపై రాజకీయ వర్గాలు కూడా విమర్శలతో నిప్పులు చెరిగాయి.ఈ వ్యవహారంపై వైస్సార్సీపీ మండిపడుతూ, “ప్రజా సమస్యల్ని గాలికొదిలేసి, ఆన్‌లైన్‌లో పేకాట ఆడుతూ డీఆర్వో ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రభుత్వ అధికారులు ఇలా వ్యవహరించటం తగునా?” అంటూ సర్కార్‌ను ప్రశ్నించింది.ముఖ్యమంత్రి, హోం మంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రిని ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు.
ప్రజల సమస్యలను పట్టించుకోవాల్సిన సమయంలో, అధికారుల ఇలాంటి నిర్వాకం వారి బాధలు మరింత పెంచుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు.ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యలు పరిష్కరించడంలో ఆసక్తి చూపాల్సిన అధికారులు ఇలా రమ్మీ ఆడటం ప్రజాసేవకు అవమానం అంటూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.ఇక డీఆర్వో మలోల వ్యవహారంపై కలెక్టర్ తక్షణం చర్యలు తీసుకోవడం, విచారణకు ఆదేశించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఈ వ్యవహారంపై ప్రభుత్వ అధికారుల క్రమశిక్షణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
ఈ ఘటన అధికారుల వృత్తిపరమైన కట్టుబాట్లు, బాధ్యతలపై ప్రశ్నలు వేయగా, దీనిపై త్వరగా చర్యలు తీసుకుని కఠిన నిర్ణయాలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.