తిరుమల పుణ్యక్షేత్రంలో అత్యంత పవిత్రంగా భావించే ప్రదేశంలో తమిళనాడు భక్తులు( Tamil Nadu Devotees ) ఓ షాకింగ్ పని చేశారు.గుంపుగా ఉన్న ఆ భక్తులు రాంభగీచా బస్టాండ్ సమీపంలో కూర్చొని ఎంచక్కా ఎగ్ బిర్యానీ( Egg Biryani ) లాగిస్తూ కనిపించడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.
తిరుమలలో( Tirumala ) మాంసాహారం తినడాన్ని కఠినంగా నిషేధించిన సంగతి తెలిసిందే.కానీ వాళ్లు పవిత్ర స్థలంలో మాంసం తింటూ అందరికీ తీవ్ర ఆగ్రహం తెప్పించారు.
విషయం తెలుసుకున్న వెంటనే అప్రమత్తమైన స్థానిక పోలీసులు ఆ భక్తుల వద్దకు చేరుకున్నారు.వారు ఎగ్ బిర్యానీ తింటుండటం చూసి విస్తుపోయారు.నిబంధనల గురించి ప్రశ్నించగా, ఆ భక్తులు మాత్రం అమాయకంగా తాము ఆ నియమాల గురించి తెలియక ఇలా చేశామని చెప్పారు.తమది మొదటి తప్పు అని, ఇకపై ఇలా జరగకుండా చూసుకుంటామని పోలీసులకు క్షమాపణలు చెప్పారు.
అక్కడ విధుల్లో ఉన్న విజిలెన్స్ అధికారి వారిని గట్టిగా హెచ్చరించారు.తిరుమల కొండలపై మాంసాహారం( Non-Veg ) తినడం తీవ్రమైన నేరమని, ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ ఈ నియమాలను తప్పకుండా గౌరవించాలని ఆయన వారికి స్పష్టం చేశారు.అయితే, పోలీసులు వారిని మొదటిసారి కావడంతో కేవలం మాటల హెచ్చరించి వదిలిపెట్టారు.తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, గుమ్మిడిపూడి గ్రామం నుంచి ఆ భక్తులు తిరుమలకు వచ్చినట్లు తెలుస్తోంది.
వారు నిజంగానే ఆంక్షల గురించి తమకు ముందుగా తెలియదని చెప్పడం గమనార్హం.
అయితే, ఈ ఘటన సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది.అంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న అలిపిరి చెక్ పోస్ట్ వద్ద బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత కూడా ఎగ్ బిర్యానీ ఎలా లోపలికి వచ్చిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.అధికారుల నిర్లక్ష్యం వల్లే మాంసాహారం తిరుమలలోకి ప్రవేశించిందని తీవ్రంగా విమర్శిస్తున్నారు.
ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.