నల్లగొండ జిల్లా:నాడు ఖమ్మం( Khammam )లో మిర్చి రైతులకు, నేడు భువనగిరిలో రీజనల్ రింగ్ రోడ్డు బాధిత రైతులకు సంకెళ్లు వేసి అవమానించిన దుర్మార్గ కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకుందామని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క( Bhatti Vikramarka ) పిలుపునిచ్చారు.భట్టి చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర బుధవారం నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధి నుండి నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కనగల్ మండల కేంద్రానికి చేరుకున్న సందర్భంగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ పేదల, రైతుల భూములను బలవంతంగా లాక్కుంటూ, న్యాయం అడిగిన రైతులపై పిడి చట్టాలతో అక్రమ కేసులు పెట్టి సంకెళ్లు వేసిన ఘటనకు జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి,మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బాధ్యత వహించాలన్నారు.
రైతాంగానికి కాంగ్రెస్ అండగా ఉంటుందని,కాంగ్రెస్( Congress ) ప్రజా ప్రభుత్వం, రైతు ప్రభుత్వం మరో ఐదు నెలల్లో రానుందన్నారు.అంబేద్కర్ అందించిన రాజ్యాంగ స్పూర్తితో అందరికీ సమాన అవకాశాలు ఇస్తామని,ఏ ప్రజల కోసం కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందో ఆ ప్రజల కోసమే తెలంగాణ సంపాదన ఉపయోగిస్తామన్నారు.
తెలంగాణకు దశాబ్ద కాలంగా పట్టిపీడిస్తున్న కేసీఆర్ ప్రభుత్వ దయ్యాన్ని పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో తరిమికొట్టనున్నామని ప్రజలకు భరోసా ఇచ్చారు.పేదలు,రైతులు,మహిళలు,విద్యార్థుల సంక్షేమం కోసం ఇందిరమ్మ రాజ్యం తీసుకువచ్చేందుకు, అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలోకి విసిరేయాలన్నారు.
కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన భూములను ధరణితో మాయ చేసి ప్రభుత్వం లాగేసుకుంటుందన్నారు.ఐదు నెలల పాటు ప్రజలు, రైతులు,పేదలు తమ భూములను కాపాడుకోవాలని వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం వారి భూములకు రక్షణ కల్పిస్తుందన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మాట్లాడే స్వేచ్ఛ లేకుండా పోయిందని,పోడు భూములకు పట్టాలు లేవని,నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, పేదలకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు లేవని,భూ పంపిణీ లేదని,రైతు రుణమాఫీ,పంట నష్టపరిహారం లేదన్నారు.తమ సమస్యలపై ప్రజలు ప్రశ్నిస్తే పోలీసులతో అణిచివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అందుకే ఇందిరమ్మ రాజ్యం స్థాపన కోసం,పేదలు, రైతులు,మహిళలు, యువకులకు న్యాయం చేయడం కోసం పాదయాత్రతో ప్రజల మధ్యకు వచ్చామన్నారు.సకలజనుల సమ్మెలో, ఉస్మానియా యూనివర్సిటీ పోరాటంలో తెలంగాణ సాధన కోసం పోరాడిన ప్రజలు,విద్యార్థులు స్వరాష్ట్రంలో తమ ఆకాంక్షలు నెరవేరక తీవ్ర నిరాశతో ఉన్నారన్నారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సాగుతున్న అవినీతి నియంతృత్వ కుటుంబ పాలనను చూసి తెలంగాణ యువత, ప్రజానీకం ఇందుకోసమేనా తాము తెలంగాణ తెచ్చుకున్నదంటూ ఆవేదన చెందుతున్నారన్నారు.కృష్ణా జలాల కోసం ఉమ్మడి నల్గొండ ప్రజలు పోరాటాలను చూసిన వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన శ్రీశైలం ప్రాజెక్టు పనులను వరల్డ్ బెస్ట్ టీబిఎం మిషన్లతో ప్రారంభించామని,70% పూర్తయిన ప్రాజెక్టు పనులను కేసీఆర్ ప్రభుత్వం( CM KCR ) వచ్చి పదేళ్లయినా పూర్తి చేయలేదని విమర్శించారు.
నక్కలగండీ,ఉదయ సముద్రం ప్రాజెక్టులను కూడా అసంపూర్తిగా మిగిలించిందన్నారు.జిల్లా ప్రజలకు కృష్ణా జలాలను అందించే ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలేదని తాను ప్రశ్నిస్తే జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి ఫెడల్ భావజాలంతో ముక్కు నేలకు రాయమంటున్నారని, గుత్తా సుఖేందర్ రెడ్డి నా పంచే గోచీల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
నాలుగు కోట్ల ప్రజల జీవితాలను మారుస్తుందని ఆశతో, నీళ్లు,నిధులు, నియామకాలు వస్తాయన్న నమ్మకంతో తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు నిరాశ మిగిలిందన్నారు.కానీ,వచ్చిన తెలంగాణలో కేసీఆర్ తో పాటు మంత్రులు,ఎమ్మెల్యేల ఆస్తులు పెరిగాయన్నారు.
జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి, గుత్తా సుఖేందర్ రెడ్డి వంటి నేతల ఆస్తులు పెరిగాయే తప్ప ప్రజల జీవితాలు ఎదగలేదన్నారు.రావి నారాయణరెడ్డి,చకిలం, ఉప్పునూతల,పాల్వయి, ధర్మ భిక్షం,మల్లు స్వరాజ్యం వంటి గొప్ప నేతలు వచ్చిన నల్గొండ జిల్లా నుండి అవినీతిపరులైన జగదీష్ రెడ్డి,గుత్తాలు నాయకులుగా రావడం దురదృష్టకరమన్నారు.
వీరిని చూసి ఆనాటి నాయకుల ఆత్మలు ఘోషిస్తున్నాయన్నారు.బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల కంటే ముందున్న ఉమ్మడి జిల్లా కమ్యూనిస్టు,కాంగ్రెస్ లో నాయకులు ప్రజల కోసం పనిచేశారని,వారు కాంట్రాక్టులు,ఆస్తులు, ఫామ్ హౌస్ లు,వందల ఎకరాల భూములు సంపాదించలేదన్నారు.
ఇప్పుడున్న బీఆర్ఎస్( BRS party ) మంత్రులు,ఎమ్మెల్యేల ఆస్తులను ఒకసారి ఆనాటి నాయకుల ఆస్తులతో బేరీజు వేసుకోవాలని ప్రజలను కోరారు.జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై జిల్లా మంత్రి జగదీష్ రెడ్డి,గుత్తాలు ప్రజలకు జవాబు చెప్పాలన్నారు.
జిల్లా ప్రజలకు ఇండ్లు,ఇండ్ల స్థలాలు ఉద్యోగాలు రాలేదని,జగదీష్ రెడ్డి, గుత్తాలకు,అధికార పార్టీ ఎమ్మెల్యేలకు మాత్రం వందల ఎకరాల్లో ఫామ్ హౌస్ లు,బంగళాలు మాత్రం వచ్చాయన్నారు.
రాబోయేది ఇందిరమ్మ రాజ్యమని,ఏ నీళ్లు, నిధులు,నియామకాల కోసం అమరులు బలిదానం అయ్యారో వారి ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుందన్నారు.
ప్రతి పేద కుటుంబానికి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు,500 కే గ్యాస్ కనెక్షన్,రేషన్ కార్డులు, పింఛన్లు,నిత్యవసర సరుకులు అందిస్తామన్నారు.రెండు లక్షల రైతు రుణమాఫీ, భూమి లేని వారికి ఏటా 12000, రైతుబంధు సహా రైతు బీమా నష్టపరిహారం, వ్యవసాయ సబ్సిడీలు అందిస్తామన్నారు.
ప్రభుత్వ పాఠశాల ద్వారా ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ప్రభుత్వ ఆంగ్ల విద్యను అందిస్తామన్నారు.పేదలకు ఉచిత నాణ్యమైన వైద్యం,ఐదు లక్షల ఉచిత వైద్య వసతి అందిస్తామన్నారు.
సంక్షేమం,అభివృద్ధి రెండింటిని ముందుకు తీసుకెళ్తామని,జూరాల, కల్వకుర్తి,నెట్టెంపాడు, భీమా,శ్రీరాంసాగర్, కోయిల్ సాగర్,శ్రీశైలం ప్రాజెక్ట్,నాగార్జున సాగర్ ప్రాజెక్టులను కాంగ్రెస్ కట్టిందని,మళ్లీ అధికారంలోకి రాగానే ఎస్ఎల్ బిసి సొరంగంలను, నక్కలగండి,ఉదయం సముద్రం,డిండి ఎత్తిపోతలను రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్, పిసిసి నాయకులు దుబ్బాక నరసింహ రెడ్డి, మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్, వైస్ ఎంపీపి జిల్లేల పరమేష్ తదితరులు పాల్గొన్నారు
.