నల్లగొండ జిల్లా:కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అధిక ధరలు, నిరుద్యోగం,ఉపాధి కుదింపునకు వ్యతిరేకంగా ఈనెల 7 నుండి వచ్చే నెల 7 వరకు దేశవ్యాప్త నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని సీపీఐ(ఎంఎల్)న్యూ డెమోక్రసీ( CPI ML ) రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జేఎస్ఆర్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్( Subhash Chandra Bose ) పిలుపునిచ్చారు.గురువారం ఆయన ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు.
నిత్యావసర సరుకుల ధరలు ఆకాశంలో ఉండగా, ఉద్యోగాల్లేక నిరుద్యోగులు ఎదురుచూపులు చూస్తున్నారని,ఉపాధి పథకానికి కేటాయింపులు కుదించడంతో కూలీల బ్రతుకులు ఆగమాగమవుతుండగా, మహిళల బ్రతుకులు ఛిద్రం అవుతూ,కుల,మత ఘర్షణలు తాండవిస్తున్నయని అన్నారు.దేశంలో బీజేపీ ప్రభుత్వం సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని,ఒక వైపు పేదలపై భారాలు వేస్తూ, ప్రజావ్యతిరేక విధానాలను అమలు చేస్తూ మరోవైపు కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు లక్షల కోట్ల రూపాయలను రాయితీ ఇస్తూ,రాష్ట్రాల హక్కులను హరిస్తున్నదనిఆరోపించారు.
ప్రజలు ప్రజాస్వామికవాదులు
ప్రజాసంఘాలు
ఎక్కడికక్కడ ప్రజాస్వామిక పోరాటాలకు ఉద్యమాలకు సిద్ధం కావాలని ప్రజలందరూ ప్రజా ఉద్యమాలలో పాల్గొనాలని ప్రజలకు, ప్రజాస్వామ్యవాదులకు విజ్ఞప్తి చేశారు.దేశంలో రోజురోజుకీ నిత్యావసర సరుకుల ధరలు హద్దూ అదుపు లేకుండా పెరుగుతున్నాయని, బియ్యం ధరలకు రెక్కలొచ్చాయని,పప్పుల ధరలు కొండెక్కాయని, కూరగాయలు,నూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని,ప్రజలు గగ్గోలు పెడుతున్నారని,దేశంలో కోట్ల మంది ప్రజలు పేదరికంలో మగ్గుతున్నారని,వీరిపై పన్నుల భారం పెంచి మరింత దారిద్య్రంలోకి నెడుతున్నారని, నిత్యావసర సరుకుల ధరలు 2014లో ఉన్న ధరలను పరిశీలిస్తే నేడు 50శాతం నుండి 200 శాతం వరకు సరుకుల ధరలు పెరిగాయని, కూరగాయల ధరలు ఈ నెలలోనే 37శాతం వరకు పెరిగాయని,పప్పులు 45శాతం పెరిగాయని, బియ్యం ధర కేజీ రూ.60లకు చేరిందని,గ్యాస్ ధరలు నేడు రూ.1200కు చేరిందని,పాల ధరలు పెరిగాయని,ఇదే అదునుగా వ్యాపారస్తులు కృత్రిమ కొరతను సృష్టించి ధరలు మరింత పెంచేశారని,ధరలు అదుపు చేయాల్సిన ప్రభుత్వం వారి కొమ్ము కాస్తున్నదని,నిత్యావసర సరుకులపై 12-18 శాతం పన్నులు వేయడంతో అనివార్యంగా ధరలు పెరుగుతున్నాయని,దీనికి తోడు విద్య,వైద్యం కోసం వేలకోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో ప్రజలు అప్పులు చేస్తూ వడ్డీ కోరల్లో చిక్కుకుంటున్నారని మోడీజీ! ప్రజల ధరల కన్నీళ్లు మీకు కనపడ్తలేవాఅని ప్రశ్నించారు.
పన్నులు తగ్గించడం ద్వారా ధరలు తగ్గుతాయని సిపిఐఎం ఎల్ వామపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయని పేర్కొన్నారు.ప్రజల కొనుగోలుశక్తి దెబ్బతినే విధంగా ఉపాధి,ఆదాయం తగ్గిందని,కరోనా తరువాత నేటికీ తిరిగి ఉపాధి అవకాశాలు మెరుగుపడలేదన్నారు.పట్టణాలలో వ్యాపారాలు, హోటళ్ళలో పనిచేసేవారు నిరుద్యోగులుగా మారారని,గ్రామీణ ప్రాంతంలో నేడు కొద్దో గొప్పో ఉపాధి దొరకుతుందంటే అది వామపక్షాల కృషితో వచ్చిన ఉపాధి హామీపథకం వల్లనేనని, ఈ పథకాన్ని కూడా ఎత్తివేయాలని కుట్రలు పన్నుతోంది నేటి బీజేపీ ప్రభుత్వం( BJP ) కనీస జీవనాధారంగా ఉన్న ఉపాధిహామీ పథకానికి కేటాయింపులు తగ్గించారని,2021-22లో రూ.98,468 కోట్లు, 2022-23లో రూ.89,400 2324లో రూ.60,000 కోట్లకు తగ్గించారని, గ్రామీణ ప్రాంతాలలో 40శాతం ప్రజలు పౌష్టికాహారలోపంతో ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధిహామి పథకాన్ని పట్టణ ప్రాంతాలకు విస్తరించడానికి కేంద్ర ప్రభుత్వం నిరాకరిస్తున్నదన్నారు.57శాతం మహిళలు,67 శాతం పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారని మానవవనరుల అభివృద్ధి సూచిక పేర్కొన్నదని గుర్తు చేశారు.
పేదరికంలో ప్రపంచంలోని 121 దేశాలలో మన దేశం 107వ ర్యాంకులో ఉందని, 2016 నుండి మనదేశ ర్యాంకు పడిపోతూనే వున్నదని,ఇప్పటికే 19శాతం గ్రామాల్లో మరుగుదొడ్ల సౌకర్యం లేదన్నారు.
సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలెక్కడని,మన దేశంలో యువత 65 శాతం వరకు వున్నారని,వీరిలో గణనీయమైన సంఖ్యలో ఉపాధి,ఉద్యోగం కరువై నిరుద్యోగులుగా తిరుగుతున్నారని,డిగ్రీలు, పిజీలు చదివిన వారు కూడా కూలి పనులకు వెళుతున్నారని,2014 ఎన్నికల సందర్భంగా సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని మోడీ హామినిచ్చారని, కానీ,ఆచరణలో వున్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయని, ఈ కాలంలో దాదాపు ఒక కోటి 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలే లక్షలాదిగా ఖాళీలున్నాయని,వాటిని భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధపడటం లేదన్నారు.దళిత,గిరిజన బ్యాక్లాగ్ పోస్టులు నింపడం లేదని, సైన్యంలో రిక్రూట్మెంట్ కొరకు యువత ఎదురుచూస్తున్న తరుణంలో అగ్నిపథ్ పేరుతో కాంట్రాక్ట్ ఉద్యోగాలను నింపాలని చూసిందని పేర్కొన్నారు.
దీన్ని యువత పెద్దఎత్తున వ్యతిరేకించి,ఆందోళనలు చేసిందని,అయినా మోడీ ప్రభుత్వం అమలు చేసిందని,నేడు దేశంలో నిరుద్యోగం 10శాతం వరకు వున్నదని లెక్కలు చెపుతున్నాయన్నారు.
ప్రైవేట్ కంపెనీలలో నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగులను తొలగిస్తున్నారని తెలిపారు.
దీంతో పాటు మోడీ సర్కార్ లేబర్ కోడ్లు తెచ్చి కార్పొరేట్లకు రక్షణ కల్పిస్తున్నదని,యువతే దేశానికి దిక్సూచి అని ప్రగల్భాలు పలుకుతున్న మోడీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేస్తున్నదని,వారి అసంతృప్తి మతోన్మాదంవైపు మళ్లించి చెలగాటమాడుతున్నదని, మతోన్మాదం ఆవహించిన ఆర్ఎస్ఎస్ మూకలు పేదలు,మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తూ కార్పోరేట్లకు లాభాలు కట్టబెడుతూ పన్నుల భారాన్ని పేదలపై పెద్దఎత్తున పెంచారని, పరోక్ష పన్నులు అనగా జిఎస్టి,నిత్యావసర సరుకులపై సెస్సులు వేస్తున్నారని,దీని ద్వారా కేంద్ర ప్రభుత్వానికి 2022-23లో రూ.19.35 లక్షల కోట్ల ఆదాయం రాగా,2023-24కు రూ.23.30 లక్షల కోట్లకు పెరిగిందన్నారు.పరోక్ష పన్నులు 39శాతం నుండి 42.74 శాతానికి పెంచారని,ధనికులపై వేసే ప్రత్యక్ష పన్నులు మాత్రం ఇతర దేశాలలో 35శాతం ఉండగా మన దేశంలో 25-28శాతం మాత్రమే విధిస్తున్నారని,ఇది ప్రత్యక్షంగా కార్పోరేట్లకు లాభాలు కట్టబెట్టడమేనని, అంతేకాక ఉపాధి కల్పించే ప్రభుత్వరంగ సంస్థలను తక్కువ ధరలకు కార్పోరేట్లకు అమ్మేసి లక్షల కోట్లు ఖజానాలో వేసుకుంటున్నారని అన్నారు.రిజర్వు బ్యాంకు మిగులు నిధులను పేదలకు ఉపయోగపడే పథకాలకు బదులుగా కార్పోరేట్లకు ఈ కాలంలోనే రూ.4.69 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ద్వారా అందించారని,
బ్యాంకులలో లక్షల కోట్లు రుణాలు తీసుకుని ఎగవేసిన సంస్థలు ప్రభుత్వ సహకారంతో వారు దేశం విడిచి వెళ్ళారని,దేశంలో 22శాతం సంపద ఒక్క శాతం కోటీశ్వరుల చేతుల్లో వున్నదని,మరోవైపు 40శాతం సంపద కేవలం 20శాతం మంది వద్ద వున్నదని,ఇదిలా వుంటే కేంద్ర ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తూ ప్రజలను అప్పుల్లోకి దించుతోందన్నారు.గత 67 ఏళ్లలో దేశం మొత్తం అప్పు 55.87లక్షల కోట్లు ఉండగా గత 9 ఏండ్లలో మోడీ ప్రభుత్వం 100 లక్షల కోట్లు ఎఫ్ఆర్ఎం పరిధికి మించి అప్పు చేసిందని,జిడిపిలో 40శాతానికి మించి అప్పు చేయకూడదనే నిబంధన ఉందని,నేడు మొత్తం అప్పు 57 శాతానికి చేరిందని,ఈ అప్పుల వల్ల ప్రతి భారతీయుని తలపై ఒక లక్షా 10 వేల రూపాయల అప్పు కత్తిలా వేలాడుతున్నదన్నారు.
దళిత,గిరిజన,మైనార్టీ పేదలే టార్గెట్ గా భారాలన్నీ మోపి,తిమ్మిని బమ్మిని చేయడం,లేనిది వున్నట్లు చూపడం మోడీకి వెన్నతో పెట్టిన విద్య, దళిత,గిరిజన, మైనారిటీలకు కేటాయించిన ఉప ప్రణాళిక నిధులను, సబ్సిడీలను 50శాతం వరకు తగ్గించారని,ఆ వర్గాలను సంతృప్తిపరడానికి రకరకాల పథకాలున్నాయని మభ్యపెడుతోందన్నారు.
ప్రభుత్వం ఉపాధితో పాటు,ఆవాసాలు లేకుండా చేయడానికి చట్టాలను మారుస్తోందని,వారి స్వాధీనంలో ఉన్న భూములను కార్పోరేట్ల హస్తగతం చేయడానికి ప్రయత్నాలు చేస్తోందన్నారు.ఈ కాలంలో అటవీహక్కుల చట్టానికి సవరణలు తెచ్చారని,భూసేకరణ చట్టానికి మార్పులు తెచ్చారని,నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా తరిమివేస్తున్నారని,విద్యా,వైద్యానికి దూరం చేస్తున్నారన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం కేంద్రం తెలంగాణకు అనేక వాగ్దానాలు చేసిందని, కాజీపేట రైల్వేకోచ్ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హెూదా,బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ, నిజామాబాద్ లో పసుపుబోర్డు,రాష్ట్రానికి గిరిజన యూనివర్సిటీ, రాష్ట్రంలో మూడు ఎయిర్పోర్టులు,చేనేతపై జిఎస్టీ తొలగింపు వంటివి వున్నాయని,వాటి ఊసే లేదని,అతీగతీ లేదన్నారు.రాష్ట్ర విభజన సమస్యలు పెండింగులోనే వున్నాయని,నీటి వాటా కేటాయింపు నానుతూనే వున్నదని,చట్టబద్ధంగా రావాల్సిన నిధులు కూడా సకాలంలో విడుదల చేయకుండా వేధిస్తున్నదని కేంద్రం తెలంగాణపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అనేక హామీలనిచ్చిందని, 2006 అటవీ హక్కుల చట్టం ప్రకారం 11.5 లక్షల ఎకరాలకు హక్కుపత్రాలు ఇస్తామని,కేవలం 4లక్షల ఎకరాలకు మాత్రమే ఇచ్చారని,దళితులు, గిరిజనులకు 3ఎకరాల భూమి ఇవ్వలేదని, కార్మికులకు కనీస వేతనాలు సవరించలేదని, సమ్మెల పట్ల అసహనాన్ని ప్రదర్శిస్తున్నారన్నారు.డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం పక్కనపెట్టి కొత్తగా గృహలక్ష్మి పథకం తెచ్చారని,అదికూడా అర్హులకు అందే అవకాశం లేదన్నారు.రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులకు 2011 చట్టం ప్రకారం రుణార్హత కార్డులు ఇచ్చి,రుణమాఫీతో పాటు వడ్డీకూడా మాఫీ చేయాలన్నారు.
సాగునీటి ప్రాజెక్టులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేయకపోవడం వల్ల వెనకబడిన ప్రాంతాలకు సాగునీటి సౌకర్యం లేదన్నారు.ఖాళీగా వున్న ఉద్యోగాలను పూర్తి స్థాయిలో భర్తీ చేయడంలేదని పేర్కొన్నారు.
అందువల్ల పేదలు,సామాన్య మధ్యతరగతి ప్రజలు ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితుల నేపథ్యంలో తక్షణమే క్రింది కోర్కెలు నెరవేర్చాలని వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమకారుడు కామ్రేడ్ జే ఎస్ ఆర్ డిమాండ్ చేశారు.
నిత్యావసర సరుకుల ధరలను తక్షణమే తగ్గించాలని, మార్కెటింగ్ వ్యవస్థను పట్టిష్టపరిచి,బ్లాక్ మార్కెట్ను అరికట్టాలని, పేదలపై వేసిన పన్నుల భారాన్ని పూర్తిగా తగ్గించాలని,కార్పోరేట్ సంస్థలపై ఆదాయపు పన్నును 50శాతానికి పెంచాలని,ఉపాధిహామీ పనులకు కేటాయింపులను 3 రెట్లు పెంచాలని,విద్య, వైద్య సౌకర్యాలు ఉచితంగా కల్పించాలని, పేదలందరికీ ఆవాసాలు కల్పించాలని,కేంద్ర ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని,శ్రమజీవుల హక్కులకై నిరంతరం పోరాటం కొనసాగిస్తున్న జేఎస్ఆర్ డిమాండ్ చేశారు.
పై కోర్కెల సాధనకు ఈనెల 7 నుండి వచ్చేనెల 7 వరకు నెల రోజుల పాటు జరుగు జన చైతన్యజైత్రయాత్ర కార్యక్రమాలలో దేశవ్యాపితంగా జరిగే నిరసన ఉద్యమంలో ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొనాలని సిపిఐఎంఎల్ సెక్రటరీ కామ్రేడ్ జేఎస్ఆర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ 9848540078 పిలుపునిచ్చారు.