నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న,ప్రపంచ మేధావి బాబా సాహెబ్ డాక్టర్ బీ.ఆర్.
అంబేద్కర్ 66 వర్ధంతి వేడుకలు ఊరువాడా ఘనంగా నిర్వహించారు.వివిధ పట్టణాల్లో,పల్లెల్లో అంబేద్కర్ విగ్రహాలకు,చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీలు,ప్రజాసంఘాల, కుల సంఘాల నేతలు మాట్లడుతూ అంబేద్కర్ మహనీయుడు ఈ దేశానికి దిక్సూచి లాంటి వారని,నేటి యువత బాబాసాహెబ్ ని స్ఫూర్తిగా తీసుకొని, ఆయన ఆలోచనల ప్రకారం నడుచుకోవాలని సూచించారు.అంబేద్కర్ అహర్నిశలు శ్రమించి భారత రాజ్యాంగం అందించి దేశానికి దశాదిశ నిర్దేశించిన ఆయన జీవిత చరిత్ర దేశ ప్రజలకు అత్యంత ఆదర్శనీయమని అన్నారు.
అణగారిన వర్గాల వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసి,ఎన్నో అవమానాలను ఎదుర్కొని,ఆస్తిత్వ ఉద్యమాలకు ఊపిరిపోసి,సమాజ శ్రేయస్సు కోసం పాటుపడిన గొప్పవ్యక్తిగా,మానవాళికి మార్గదర్శిగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిలిచారని ఆయన సేవలను కొనియాడారు.దేశ ప్రజలకు మంచి మార్గం చూపిన స్ఫూర్తి ప్రదాత,దేశ్ కీ నేత కొందరి వాడు కాదని,సకల జనుల శ్రేయస్సు కోరిన అంబేద్కర్ అందరి వాడని ప్రశంసించారు.
అలాంటి మహానుభావుడి ఆశయ సాధన కోసం కుల,మత,వర్గ బేధాలు చూడకుండా ప్రతి ఒక్కరూ పయనించాలని పిలుపునిచ్చారు.