అగ్ర రాజ్యం అమెరికాలో గన్ కల్చర్ విపరీతంగా పెరిగిపోతోంది.ఎలాంటి భయంకరమైన సంఘటనలు జరిగినా, ఎంతో మంది అమాయక ప్రజలు బలై పోయినా, చిన్న పిల్లలు సైతం తుపాకి తూటాలకు ప్రాణాలు కోల్పోయినా సరే గన్ కల్చర్ పై ఏ మాత్రం నియంత్రణ రావడం లేదు సరి కదా దుండగుల నుంచీ కాపాడాల్సిన పోలీసులే తూటాలకు బలై పోతున్నారు.
తాజాగా అమెరికాలో చోటు చేసుకున్న ఇలాంటి ఘటనే పోలీసు అధికారులను కలిచి వేస్తోంది.యువ పోలీస్ అధికారిగా భాద్యతలు చేపట్టిన కొంత కాలానికే గన్ కల్చర్ కు బలై పోయాడు ఓ పోలీస్ అధికారి.
వివరాలలోకి వెళ్తే అమెరికాలోని ఇండియానాకు సుమారు 75 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న ఎల్ ఫుడ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న యువ పోలీస్ అధికారి నొహ్ షానవాజ్ (24) ను విచక్షణా రహితంగా కాల్చి చంపేశాడు ఓ దుండగుడు.ట్రాఫిక్ నియంత్రణ ప్రదేశంలో విధులు నిర్వహిస్తున్న షానవాజ్ వేగంగా వస్తున్న కారును ఆపాలంటూ చెయ్యి ఎత్తి ఆపమని సిగ్నల్ ఇచ్చాడు.
కారు ఆపిన దుండగుడు వెంటనే కోపంతో కారులోంచి దిగి షానవాజ్ పై కాల్పులు జరపడంతో అక్కడిక్కడే మృతి చెందాడు.
షానవాజ్ పై కాల్పులు జరిపిన వెంటనే కారులో వేగంగా వెళ్ళిపోయిన దుండగుడిని సుమారు 30 నిమిషాల పాటు వెంబడించి పట్టుకున్నారు పోలీసులు.
గతంలో ఈ దుండగుడిపై నేర చరిత్ర కూడా ఉందని, క్రిమినల్ రికార్డ్స్ లో కూడా దుండగుడు ఉన్నాడని గుర్తించారు.కాగా కొన్నేళ్ళ క్రితమే ఉద్యోగంలో చేరిన షానవాజ్ పోలీస్ ఉద్యోగాన్ని ఎంతో ఇష్టపడే వాడని, అందుకే తక్కువ వయసులోనే ఉద్యోగం సాధించాడని కానీ అతి చిన్న వయసులోనే మృతి చెందటం భాదాకరమైన విషయమని ఇండియానా పోలీస్ అధికారులు సంతాపం ప్రకటించారు.