మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లుగా వుంది బ్రిటన్ పరిస్ధితి.ఇప్పటికే కరోనాతో సతమతమవుతున్న ఇంగ్లీష్ గడ్డ.
తాజాగా ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది.గత కొన్నిరోజులుగా బ్రిటన్లోని సూపర్ మార్కెట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి.
దాంతో తిండిగింజల కోసం యూకే వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు.
కరోనా మహమ్మారి సంక్షోభంతో బ్రిటన్లో ఆహారం, ఇంధన సరఫరా, రవాణా సమస్య కూడా తలెత్తడం ప్రారంభమైంది.
వైరస్, లాక్డౌన్ కారణంగా సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడం వల్ల నిత్యవసర వస్తువులు క్రమంగా మార్కెట్ నుంచి కనుమరుగవడం మొదలైంది.ఫలితంగా సూపర్మార్కెట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.బుధవారం బ్రిటన్లో దాదాపు 44 వేల కొత్త కేసులు నమోదయ్యాయి.
అయితే దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తికావస్తున్నందున త్వరలో వ్యాపారాలను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వెల్లడించారు.
ప్రస్తుతం బ్రిటన్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఇప్పటివరకు 87 శాతం మందికి ఫస్ట్ డోస్.68 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.

అటు మాంసం పరిశ్రమ కూడా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.కార్మికుల కొరత వల్ల సప్లై చైన్లు ప్రమాదపు అంచుల్లో వున్నాయని బ్రిటన్ మీట్ ఇండస్ట్రీ బుధవారం తెలిపింది.దేశవ్యాప్తంగా వున్న మాంసం పరిశ్రమలో కొన్ని ప్లాంట్లలో 10 శాతం, మరికొన్ని చోట్ల 16 శాతం కార్మికుల కొరత వుందని వెల్లడించింది.
అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఉండటంతో ఆరోగ్యం, రవాణా వంటి కీలక రంగాలకు ప్రభుత్వం మినహాయింపులు ప్రకటించింది.అయినప్పటికీ డ్రైవర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది.దీనిపై స్పందించిన యూకే రవాణా శాఖ కార్యదర్శి గ్రాంట్ షాప్స్.సమస్యను పరిష్కరించేందుకు గాను ట్రాక్ లైసెన్సింగ్ ప్రక్రియను వేగవంతం చేసినట్లు చెప్పారు.
మరోవైపు దేశంలోకి ఈయూ డ్రైవర్లను అనుమతిస్తేనే డ్రైవర్ల కొరతను పరిష్కరించవచ్చని కొందరు వాదిస్తున్నారు.ప్రస్తుతం రవాణా శాఖ కార్యాలయాల్లో 25000 ట్రక్ డ్రైవర్ల లైసెన్స్ దరఖాస్తులు పెండింగ్లో వున్నాయి.