కరోనా నేపథ్యంలో ఒక పక్క లాక్ డౌన్ తో ప్రజలు నానా తిప్పలు పడుతుంటే కొంత మంది మాత్రం ఈ వైరస్ భయం తో జనాలపై కూడా రసాయనాలు చల్లుతూ పెద్ద తలనొప్పి తీసుకువస్తున్నారు.కరోనా ప్రబలకుండా వస్తువుల పై స్ప్రే లు,రసాయనాలు వాడాలి అంటూ ప్రభుత్వాలు చెబుతుంటే కొంతమంది అతి జాగ్రత్త కోసం ఈ రసాయనాలు,పొడులను మనుషులపై కూడా చల్లుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు పెద్దగా చోటుచేసుకోనప్పటికీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం చాలామంది ఇలానే మనుషులపై రసాయనాలు,పొడులు చల్లుతూ కరోనా నుంచి తమని తాము కాపాడుకోవాలని చూస్తున్నారు.దీనితో వెంటనే రంగంలోకి దిగిన కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నట్టుండి కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.
ఇకపై ఎవరైనా కావాలనిగానీ, అనుకోకుండాగానీ… రసాయనాలు, పొడులు, పురుగు మందులు, స్ప్రేలను వ్యక్తులపై లేదా గ్రూపులపై చల్లడానికి వీల్లేదు.ఒకవేళ ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే వారి పై పాండెమిక్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం అంటూ ఆ మార్గదర్శకాల్లో వెల్లడించింది.
చాలా మంది సోడియం హైపోక్లోరైట్ స్ప్రేను కొనుక్కొని ఇంట్లో భద్రంగా పెట్టుకుంటున్నారు.తమ ఇంటికి ఏ డెలివరీ బాయో, ఇంకెవరైనా వస్తే వారిని నిలిపివేసి మరి హడావుడిగా స్ప్రే తెచ్చి వారిపై కొడుతున్నారు.
ఇదేటండీ అంటే అంతా మంచికే అంటూ మీ డ్రెస్సుపై కరోనా ఉంటే చచ్చిపోతుంది అని సమాధానం చెబుతున్నారు.అయితే ఇలా చల్లడం మంచిది కాదని దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటూ కేంద్రం స్పష్టం చేసింది.
ఎవరికైనా కరోనా సోకితే వారిపై ఈ ద్రావణాలు చల్లడం వల్ల ఉపయోగం లేదనీ… బాడీ లోపల ఉన్న కరోనా బయట స్ప్రేలు చల్లితే ఎలా చస్తుందని కేంద్రం ప్రశ్నిస్తోంది.ఇలాంటి స్ప్రేల వల్ల కరోనా చనిపోతుందనేందుకు ఆధారాలు లేవని చెప్పింది.
స్ప్రేలు చల్లితే… కళ్లు, చర్మం పాడవుతాయనీ, గ్యాస్ట్రోఇంటెస్టినల్ ఎఫెక్ట్స్ ఏర్పడతాయనీ, వికారం, వాంతుల వంటివి వస్తాయని కేంద్రం తెలిపింది.
సోడియం హైపోక్లైరైట్ పీల్చితే… ముక్కు, గొంతు, ఊపిరితిత్తుల్లో దురదలు, చిరాకు వంటివి వస్తాయని చెప్పింది.దీని వల్ల బ్రాంకోస్పాస్మ్ (bronchospasm) వచ్చే ప్రమాదం ఉందని కేంద్రం స్పష్టం చేసింది.అందుకే మనుషుల పై ఇలాంటి రసాయనాలు స్ప్రే చేస్తే ఇక పై ఊరుకోము అని వారిపై పాండెమిక్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటాం అని కేంద్రం తెలిపింది.
మనుషులతో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది అని కేంద్రం సూచించింది.