తమకు తిరిగే లేకుండా పరిపాలన చేసుకుంటూ, జనరంజక పాలన అందిస్తున్నామని ఏపీ సీఎం జగన్ చాలా సంతోషంగా ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు.దీనికి తగ్గట్టుగానే జగన్ పరిపాలనపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తూ వస్తున్నాయి.
జగన్ పాటిస్తున్న విధానాలను తమ తమ రాష్ట్రాల్లో పాటించేందుకు అన్ని రాష్ట్రాలు ప్రయత్నిస్తూ ఉండడం, పదే పదే జగన్ తీరును పొగుడుతూ జాతీయ మీడియా సైతం కథనాలు ప్రచారం చేయడం ఇవన్నీ జగన్ కు ఎక్కడలేని ఆనందాన్ని తీసుకొస్తున్నాయి .
అలాగే ప్రభుత్వ పథకాలు ప్రవేశ పెట్టడం గాని, సంక్షేమ పథకాలకు ఎటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కూడా లెక్క చేయకుండా అమలు చేస్తూ, జగన్ జనం మెచ్చిన నాయకుడుగా మరింత బలోపేతం అయ్యేందుకు ప్రతిక్షణం కష్టపడుతూనే, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు.అలాగే తన ప్రభుత్వంను , మంత్రిమండలిని ఎవరు వేలెత్తి చూపించకుండా, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం కల్పించి, అంతకు ముందున్న ముఖ్యమంత్రుల కంటే జగన్ పూర్తిగా భిన్నం అనే అభిప్రాయం జగన్ కలిగించడంలో సక్సెస్ అయ్యారు.
ఇంత వరకూ బాగానే ఉన్నా, అసలు వైసీపీ అధికారంలోకి తీసుకువచ్చిన పార్టీ నాయకుల విషయంలో జగన్ చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే నిందలు రావడమే కాకుండా, పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని, పార్టీ కోసం కష్ట పడిన వారికి ఇప్పటికీ పదవులు దక్కకపోవడం, ఇతర పార్టీల నుంచి కొత్తగా పార్టీలో చేరిన వారికి, ఎన్నికల ముందు పార్టీలో చేరి సీటు సంపాదించి మంత్రులు, ఎమ్మెల్యేలుగా ఎన్నికైన వారు, ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారిలో చాలామందికి నామినేటెడ్ పదవులు దక్కడం, మొదటి నుంచి వైసీపీ కోసం కష్ట పడిన వారికి మొండిచేయి చూపించడం వంటి పరిణామాలతో చాలా కాలంగా వైసిపి నాయకులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
ప్రభుత్వ పథకాలు, పనుల విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ, అధికార పార్టీ నాయకుల మాట చెల్లుబాటు అయ్యే విధంగా ఉండేది.కానీ వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా అధికారులకు అన్ని బాధ్యతలు అప్పగించి, అధికార పార్టీ నాయకులను ఉత్సవ విగ్రహాలుగా మార్చారనే అభిప్రాయమే మెజారిటీ నాయకుల్లో ఉండిపోయింది.
పేరుకే తాము అధికార పార్టీ నాయకులుగా ఉన్నాము తప్ప, తమ మాట ఎక్కడా చెల్లుబాటు కావడం లేదని, దీని కారణంగా ప్రజల్లో తమ పై చులకన భావం ఏర్పడిందని, తగిన గుర్తింపు లేకుండా పోయింది అనేది వైసీపీలోని నాయకుల అభిప్రాయం.
అసలు ఎమ్మెల్యేల్లోనే ఈ తరహా అసంతృప్తి నెలకొంది.పూర్తిగా తాము నియోజకవర్గంలో పెత్తనం చెలాయించేందుకు అవకాశం లేకపోవడం, అన్ని వ్యవహారాలు అధికారులే చక్కబెట్టేస్తుడడం, కొన్ని కొన్ని విషయాల్లో చూసీచూడనట్లుగా ప్రభుత్వం వ్యవహరించాల్సి ఉన్నా, ప్రభుత్వం అవి పట్టనట్టుగా వ్యవహరించడమే కాకుండా, తమపైనే నిఘా ఏర్పాటుచేసి, ఆర్థికంగా తమకు ఆదాయం తెచ్చి పెట్టె మార్గాలన్నింటినీ మూసివేస్తూ ఉండడం వంటి పరిణామాలు ఎమ్మెల్యేల్లోనూ, ప్రజాప్రతినిధుల్లో తీవ్ర అసంతృప్తి పెరగడానికి కారణం అవుతోంది.దీనికితోడు నామినేటెడ్ పదవులు, కార్పొరేషన్ పదవుల భర్తీ చేపట్టకుండా వాయిదా వేసుకుంటూ వస్తుండడం వంటి వ్యవహారాలు వైసిపి నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు రేకెత్తిస్తున్నాయి.
ఇప్పటికే పార్టీ నాయకులు ఈ విధంగా పడుతున్న ఇబ్బందులు, అసంతృప్తుల వ్యవహారం జగన్ వరకు వెళ్లినా, ఆయన మొత్తం ఈ వ్యవహారాలను పరిష్కరించాల్సిందిగా జిల్లా ఇంచార్జీ మంత్రులకు సూచించడం, వారు ఈ విషయాల్లో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తుండడం వంటి పరిణామాలతో కిందిస్థాయి వైసీపీ నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు పెరిగిపోతున్నాయి.ఈ విషయాల పై పూర్తిగా దృష్టి పెట్టి, జగన్ రంగంలోకి దిగకపోతే వచ్చే ఎన్నికల నాటికి నాయకుల మధ్య అసంతృప్తి మరింతగా పెరిగిపోయి, అది పార్టీకి చేటు తెచ్చే విధంగా మారే అవకాశం లేకపోలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట.