ఏపీలో మొత్తం 12 కార్పొరేషన్లు… 75 మున్సిపాల్టీలు / నగర పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి.నామినేషన్ల ఉప సంహరణ కార్యక్రమం పూర్తయ్యే సరికే వైసీపీ మూడు కార్పొరేషన్లతో పాటు 15 మున్సిపాల్టీల్లో విజయం సాధించడం లేదా విజయానికి దగ్గరైంది.
దీనిని బట్టే వైసీపీ దూకుడు పట్టణ పోరులో ఎలా ఉందో అర్థమవుతోంది.ఇదిలా ఉంటే ఏపీలో పట్టణ ఎన్నికలపై వైసీపీ సొంతంగా సర్వే చేయించుకుంది.
ఇప్పటికే పలు ప్రీ పోల్ సర్వేలు వచ్చాయి.ఈ సర్వేల్లోనూ వైసీపీ తిరుగులేని ఆధిక్యంతో గెలుస్తుందని వెల్లడైంది.
అయితే ఆ సర్వేలు టీడీపీకి మూడు చోట్ల ఛాన్స్ ఉంటే ఉండవచ్చని చెప్పాయి.
అయితే వైసీపీ అంతర్గత సర్వేలో మాత్రం 11 కార్పొరేషన్లలో తాము తిరుగులేని విజయం సాధిస్తామన్న ధీమా వచ్చేసింది.
వైజాగ్, గుంటూరు, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం లాంటి కార్పొరేషన్లలో కూడా తమకు తిరుగులేని విజయం వస్తుందని ఈ సర్వే చెప్పినట్టు సమాచారం.అయితే ఒక్క విజయవాడ కార్పొరేషన్లో మాత్రమే తమకు టీడీపీ నుంచి గట్టి పోటీ ఉందని… అయిన ఎన్నికల వేళ అక్కడ కూడా తాము టీడీపీకి షాక్ ఇచ్చి విజయం సాధించడంతో పాటు మేయర్ పీఠం దక్కించుకుంటామని చెపుతోంది.

విజయవాడలో గత ఎన్నికల్లో కూడా టీడీపీ ఎంపీ సీటు దక్కించుకుంది.అలాగే కార్పొరేషన్ పరిధిలో ఉన్న తూర్పు నియోజకవర్గం కూడా టీడీపీ గెలవగా… సెంట్రల్ నియోజకవర్గంలో కూడా టీడీపీ గట్టి పోటీ ఇచ్చి కేవలం 25 ఓట్ల తేడాతో ఓడింది.అయితే ఈ సారి మాత్రం టీడీపీ హవాకు పూర్తిగా చెక్ పెట్టాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు.అందుకే ఇక్కడ కూడా ఓడిపోయేందుకు జగన్ ఒప్పుకోరన్నది తెలిసిందే.అందుకే జిల్లా నేతలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన మంత్రులకు సైతం ఇక్కడ బాధ్యతలు అప్పగించారు.