గత కొంత కాలంగా ఏపీ లో వరుస వరుసగా ఐటీ దాడులు జరుగుతుండడం సంచలనం రేపుతోంది.ఒక పక్క అంతా ఎన్నికల హడావుడిలో నిమగ్నమై ఉంటే మరో పక్క కొంతమంది నాయకులే టార్గెట్ గా చేసుకుని ఐటీ రైడ్స్ జరగడం అనుమానాలు రేకెత్తిస్తోంది.
ఎన్నికలకు సంబందించిన ప్రచారం, ప్రణాళికలు వేస్తూ క్షణం తీరిక లేకుండా ఉన్న నాయకులకు ఈ వ్యవహారం దడ పుట్టిస్తోంది.ముఖ్యంగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న కొంతమంది అభ్యర్థులను టార్గెట్ గా చేసుకుని రైడ్స్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
మోదీపై అవిశ్వాస తీర్మానం పెట్టిన టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పై ఐటీ దాడుల వ్యవహారం ఒక్క సారిగా హాట్ టాపిక్ గా మారింది.దీనికి కారణం గల్లా జయదేవ్.
మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని పార్లమెంట్‌లో మోదీకి వ్యతిరేకంగా మాట్లాడడమే అని టీడీపీ అనుమానిస్తోంది.
అమరరాజా బ్యాటరీస్ వైస్ చైర్మన్ గా, దేశంలోనే విజయవంతమైన పారిశ్రామికవేత్తలల్లో జయదేవ్ ఒకరు.
ఆయన జాతీయ స్థాయిలో అందరికి తెలిసిన వ్యక్తి.దీంతో ఆయనపై ఐటీ దాడులనే సరికి, అదీ కూడా బరిలో ఉన్న అభ్యర్థి కావడం, పోలింగ్ ముందు రోజు ఈ వ్యవహారం చోటుచేసుకోవడం సంచలనం సృష్టిస్తోంది.
అదీ కాకుండా ఆరు గంటల పాటు గల్లా జయదేవ్ ఆడిటర్ ను నిర్బంధించి జయదేవ్ అక్రమ ఆస్తులకు సంబందించిన కీలక సమాచారం తమకు అందించాలంటూ తీవ్రమైన ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది.ఈ ఐటీ దాడులు ఏపీలోనే కాకుండా దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న రాజకీయ పార్టీల నాయకులే లక్ష్యంగా జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ సన్నిహితుల ఇళ్లలో వందల మంది అధికారులు సోదాలు నిర్వహించారు.అధికారికంగా అక్కడ ఏమి దొరికిందో చెప్పలేదు కానీ, వందల కోట్లంటూ పెద్ద ఎత్తున ప్రచారం మాత్రం జరిగిపోయింది.ఐటీ దాడులు జరుగుతున్న తీరు మాత్రం అనేక అనుమానాలు రేకెత్తించేలాగే ఉంది.దాడులు మొత్తం బీజేపీ వ్యతిరేకపక్షాలపై మాత్రమే జరుగుతూండటంతో ఎన్నికల సంఘంపైనా తీవ్రమైన విమర్శలు వచ్చాయి.
మోడల్ కోడ్ అమలులో ఉన్న సమయంలో అభ్యర్థులపై ఐటీ దాడులు చేయడం అనేది చట్ట విరుద్ధం అంటూ కొంతమంది వాదిస్తున్నారు.ఒక వేళ ఐటీ రైడ్స్ చేయాలనుకున్నా ఈసీ అనుమతి తీలుసుకోవాలని, కానీ ఇప్పుడు ఐటీ శాఖ చేస్తున్న దాడుల్లో ఆ విధానాన్ని పాటించడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.