సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం భోలక్ పూర్ కృష్ణా నగర్ లోని మేకలమండి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ బుధవారం విద్యార్థుల తల్లిదండ్రుల కమిటి, హై స్కూల్ సాధన కమిటి ఆద్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉన్నత పాఠశాల సాధన కమిటి కన్వీనర్, సీనియర్ జర్నలిస్ట్, హైదరాబాద్ జిల్లా జర్నలిస్ట్ యూనియన్( HUJ) అధ్యక్షుడు E.
చంద్రశేఖర్ మాట్లాడుతూ సికింద్రాబాద్ మండలంలోని మేకలమండి ప్రాథమికోన్నత పాఠశాలలో 760 మంది పేద విద్యార్థులు ఉన్నారని అన్నారు.కేవలం 10 మంది టీచర్లు మాత్రమే పనిచేస్తున్నారని, అన్ని సబ్జెక్ట్ లకు బోధన అందించలేకపోతున్నరని అన్నారు.
కరోనా విపత్తు కారణంగా ప్రైవేట్ స్కూల్ లలో ఫీజులు కట్టలేక మేకలమండి స్కూల్ లో అడ్మిషన్లు పెరిగిపోయాయని, ఇంగ్లీష్ మీడియంలో చక్కని బోధన అందిస్తూ చుట్టుపక్కల ప్రజల నుండి మంచి ఆదరణ పొందిందని తెలిపారు.
విద్యార్థుల నిష్పత్తి కి తగిన విధంగా ఉపాధ్యాయులను నియమించాలని కోరుతూ తాము ఇదివరకే రాష్ట్ర మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని కలిసి వినతి పత్రాన్ని అందజేసామని ఆయన చెప్పారు.ఆయన స్పందించి DEO కు చెప్పినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
ఇప్పటికైనా జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే ఈ పాఠశాలకు టీచర్లను నియమించాలని, లేదంటే పేరెంట్స్ కమిటీ, హై స్కూల్ సాధన కమిటి ఆద్వర్యంలో ఆందోళన మరింత ఉదృతం చేస్తామని ఆయన హెచ్చరించారు.
తాము పెద్దగా చదువుకోలేదనీ, కనీసం తమ పిల్లలకు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని మేకలమండి స్కూల్ లో చేర్పించామని, అధికారులు సరిపడేంత టీచర్లను నియమించాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు.
హై స్కూల్ సాధన కమిటి కో కన్వీనర్ బి.నర్సింగ్ రావు, SMC కమిటి చైర్మన్ పుల్లారావు, వైస్ చైర్మన్ వరలక్ష్మి, విద్యార్ధుల తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.