సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఏపీ, తెలంగాణతోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా తనదైన రీతిలో విమర్శలు గుప్పించారు.
ముఖ్యంగా బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై చాలా ఘాటైన కామెంట్స్ చేశారు.టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఎంపీ సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం దుబాయ్‌లో చేయడానికి ఓ బలమైన కారణమే ఉందని ఆయన వెల్లడించారు.

అక్కడి నుంచి ఆపరేషన్ ఆకర్ష్‌కు బీజేపీ తెర తీసిందని ఓ సంచలన విషయాన్ని ఆయన చెప్పారు.ఈ వేడుకకు వైసీపీ, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు వెళ్తున్నట్లు నారాయణ తెలిపారు.కేసీఆర్, జగన్ అప్రమత్తంగా లేకపోతే ఇద్దరూ మునుగుతారని ఆయన చెప్పడం గమనార్హం.విలువలు లేని రాజకీయం చేస్తూ మోదీ, అమిత్ షా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని, గాంధీని చంపిన గాడ్సేకు గుడి కట్టించినట్లు బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని నారాయణ అన్నారు.

ఇక ఏపీలో జగన్ తీరుపై స్పందిస్తూ.చంద్రబాబుపై కోపాన్ని ప్రజలపై చూపించడం మానుకోవాలని హితవు పలికారు.మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు బూతు రాజకీయాలు మానుకోవాలని సూచించారు.బ్లాక్ టికెట్లు అమ్మేవాళ్లు చట్టసభల్లోకి వెళ్లారని, మాల వేసుకున్న వాళ్లు కూడా ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడుతున్నారని నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
జగన్ తన హామీల అమలు కోసం భూములు అమ్మడం ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడమే అవుతుందని అన్నారు.ఇటు తెలంగాణలో కేసీఆర్ పాలనపై స్పందిస్తూ.
ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.ఆయన చెప్పినట్లే కోర్టుల్లో తీర్పులు వస్తున్నాయని ఆరోపించారు.