తెలుగు సినిమాలలో ముఖ్యంగా బాలయ్య నటించే ఫ్యాక్షన్ సినిమాలలో కార్లు లేదా టాటా సుమో వాహనాలు వరుసబెట్టి ఒకదాని వెనకాల ఒకటి వస్తూ ఉంటాయి.అది చూసి ఇన్ని కార్లు ఎందుకు అని మనం అనుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
కానీ అమెరికాలో ఏకంగా 2100 కార్లు, అవీ మామూలు కార్లు కాదు, స్పోర్ట్స్ కార్లు ఒకదాని వెనకాల ఒకటి వరుసబెట్టి రావడంతో ఇప్పుడు ఆ వార్త అమెరికా మొత్తం హల్చల్ చేస్తోంది.
అమెరికాలోని మిస్సౌరీకి చెందిన 14 ఏళ్ల అలెక్ అనే బాలుడికి స్పోర్ట్స్ కార్లంటే చాలా ఇష్టం.
అయితే అతడు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు.అతడు ఎక్కువ కాలం బతకడని వైద్యులు తేల్చిచెప్పడంతో అతడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.
అయితే అతడి చివరి కోరిక ఏమైనా ఉందా అని అతడిని అడగ్గా, తన అంతిమ యాత్రకు స్పోర్ట్స్ కార్లు రావాలి అంటూ బదులిచ్చాడు.కాగా ఈ నెల 7న అలెక్ కన్నుమూశాడు.
అతడి చివరి కోరిక గురించి తెలుసుకున్న సిడ్నీస్ సోల్జర్స్ ఆల్వేస్ అనే సంస్థ స్పోర్ట్స్ కార్స్ ఫర్ అలెక్ అంటూ ప్రచారం నిర్వహించింది.అలెక్ చివరి కోరిక తీర్చేందుకు చాలా మంది ముందుకు వచ్చారు.
ఈ క్రమంలో ఏకంగా 2100 స్పోర్ట్స్ కార్లతో పాటు, 70 స్పోర్ట్స్ బైకులు కూడా అలెక్ అంతిమయాత్రలో పాల్గొన్నాయి.అలెక్ ఆత్మకు శాంతి చేకూరాలని వారందరూ కోరుకున్నారు.మనం సినిమాలో చూసే కార్ల ర్యాలీ ఇక్కడ ఓ బాలుడి చివరి కోరిక తీర్చేందుకు ముందుకు రావడంతో ఆ వార్త తెలుసుకున్న ప్రతిఒక్కరు కన్నీటి పర్యంతం అయ్యారు.