బెంగళూరు నగరంలో( Bangalore city ) బుధవారం ఉదయం 11 గంటలకు ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది.నేలమంగళ నుంచి దాసనాపురానికి ప్రయాణిస్తున్న బీఎంటిసి బస్సును నడుపుతున్న 40 ఏళ్ల డ్రైవర్‌కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది.
క్షణాల్లోనే అతడు ప్రాణాలు విడిచాడు.బస్సు డ్రైవ్ చేస్తూనే అతడు చనిపోయిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ వీడియోలో డ్రైవర్‌కు గుండెపోటు వచ్చి కుప్పకూలిపోయిన క్షణం స్పష్టంగా కనిపిస్తోంది.ఈ పరిస్థితిని గమనించిన కండక్టర్ వెంటనే స్పందించి డ్రైవర్ సీటులోకి ఎక్కాడు.
బస్సును విజయవంతంగా కంట్రోల్ చేశాడు.కండక్టర్ త్వరితగతిన తీసుకున్న చర్యల వల్ల రోడ్డుపై ప్రయాణిస్తున్న అనేక మంది ప్రాణాలు రక్షించినట్లైంది.
ఈ విషాద సంఘటన బెంగళూరు ప్రజలను కలచివేసింది.బస్సు డ్రైవర్ మరణంపై ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.అదే సమయంలో, కండక్టర్ ధైర్యసాహసాలను అభినందిస్తున్నారు.మృతి చెందిన బస్సు డ్రైవర్‌ను కిరణ్ కుమార్‌గా గుర్తించారు అతను ఆ సమయంలో కేఏ 57 ఎఫ్-4007 నంబరు కలిగిన 256 ఎం/1 రూటు బస్సును డ్రైవ్ చేస్తున్నాడు.
కండక్టర్‌గా ఓబలేష్ పనిచేస్తున్నాడు.అతనే బస్సులోని ప్రయాణికులందరినీ సురక్షితంగా ఉంచి, ఏ విధమైన ప్రమాదం జరగకుండా చూశారు.అనంతరం, ఓబలేష్ కిరణ్ కుమార్‌ను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.వైద్యులు పరీక్షించి కిరణ్ కుమార్‌కు గుండెపోటు వల్లే మరణం సంభవించిందని నిర్ధారించారు.
బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటిసి) డ్రైవర్ కిరణ్ కుమార్ మరణం పట్ల తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేసింది.కిరణ్ కుమార్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది.ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నట్లు బీఎంటిసి ప్రకటించింది.బీఎంటిసి ఉన్నతాధికారులు కిరణ్ కుమార్ కుటుంబాన్ని సందర్శించి, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.అంతేకాకుండా, కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు.