అమెరికా అధ్యక్ష ఎన్నికలు హోరాహోరీగా జరుగుతున్నాయి.డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్ధి కమలా హారిస్,( Kamala Harris ) రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్‌లు( Donald Trump ) నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతుండగా.
ఇప్పటి వరకు వస్తున్న ఫలితాలను బట్టి డొనాల్డ్ ట్రంప్ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శిస్తూ అధ్యక్ష పీఠం దిశగా దూసుకెళ్తున్నారు.అధ్యక్ష ఎన్నికలతో పాటు యూఎస్ కాంగ్రెస్, రాష్ట్రాల చట్టసభలు, లోకల్ బాడీలకు కూడా ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.
ఈ ఎన్నికల్లో పలువురు భారత సంతతి నేతలు కూడా పోటీ చేశారు.
కాలిఫోర్నియాకు ప్రాతినిథ్యం వహిస్తున్న యూఎస్ హౌస్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో భారత సంతతికి చెందిన రో ఖన్నా( Ro Khanna ) విజయం సాధించారు.తన సమీప ప్రత్యర్ధి , రిపబ్లికన్ నేత భారత సంతతికే చెందిన అనితా చెన్‌ను( Anita Chen ) ఆయన సులభంగా ఓడించారు.తనకు ఓటు వేసిన 17వ జిల్లా ఓటర్లకు రో ఖన్నా కృతజ్ఞతలు తెలిపారు.
మరో రెండేళ్లు కాంగ్రెస్‌లో మీ మద్ధతును పొందగలనని ఆయన ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు.ఖన్నా తొలిసారిగా 2016లో యూఎస్ హౌస్‌కు( US House ) ఎన్నికయ్యారు.హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీలో ఆయన సభ్యుడు.శాన్‌ఫ్రాన్సిస్కోకు దక్షిణంగా ఉన్న సిలికాన్ వ్యాలీలోని భాగాలను కలిగి ఉన్న 17వ జిల్లా 1990 నుంచి డెమొక్రాట్‌లకు కంచుకోటగా ఉంది.
పంజాబ్ నుంచి అమెరికాకు వలస వెళ్లిన హిందూ కుటుంబంలో జన్మించారు రో ఖన్నా. ఆయన తండ్రి ఐఐటీ బాంబే, యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో చదువుకోగా, తల్లి స్కూల్ టీచర్‌గా పనిచేశారు.ఖన్నా తల్లి తరపు తాతగారు అమర్‌నాథ్ విద్యాలంకార్ భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు.లాలాలజ్‌పత్ రాయ్‌తో కలిసి ఉద్యమాలు చేసిన ఆయనను బ్రిటీష్ ప్రభుత్వం జైలుకు కూడా పంపింది.
ఇక రో ఖన్నా యూనివర్సిటీ ఆఫ్ చికాగో నుంచి ఆర్ట్స్, ఎకనామిక్స్, హానర్స్‌లో డిగ్రీ చేశారు.డెమొక్రాటిక్ పార్టీకి గట్టి మద్ధతుదారైన రో ఖన్నాను 2009లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డిపార్ట్‌మెంట్ ఆఫ్ కామర్స్‌లో అసిస్టెంట్ సెక్రటరీగా నియమించారు.
తర్వాత కాలిఫోర్నియా రాష్ట్రంలోని 17వ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రజాప్రతినిధుల సభకు వరుసగా నాలుగు సార్లు ఎన్నికయ్యారు రో ఖన్నా.