తెలంగాణ అధికార పార్టీకి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది.అధికార పార్టీ నాయకులుగా తమకు ఉన్నా అధికారాన్ని ఉపయోగించుకుని ప్రజల్లో నిత్యం తిరగాల్సిన మంత్రులు, ఎమ్యెల్యేలు ఇప్పుడు హైదరాబాద్ కే పరిమితం అయిపోతున్నారు.
పార్టీ తరపున కానీ, ప్రభుత్వం తరపున కానీ ఇప్పుడు ఎటువంటి ముఖ్యమైన మీటింగ్ లు లేకపోయినా వీరంతా ఎందుకు అక్కడే తిష్ట వేయాల్సి వస్తోంది అనే అనుమానం అందరికి తలెత్తుతోంది.అయితే దీనికి కారణం వారు తమ తమ నియోజకవర్గాల్లో ముఖం చూపించలేకే రాజధాని హైదరాబాద్ లోనే చాలా కాలంగా తిష్ట వేసారట.
మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విధంగా నియోజకవర్గాలకు దూరంగా ఉండిపోవడంతో ఆయా ప్రాంతాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకుపోతున్నాయట.అసలు వారు ఇంతగా దూరం జరగడానికి ప్రధాన కారణం ఆర్టీసీ సమ్మె కారణం అని తెలుస్తోంది.
సొంత నియోజక వర్గాల్లో తాము తిరుగుతూ ఉంటే వినతి పత్రాలతో ఆర్టీసీ కార్మికులు వస్తుంటారు.మీడియా కూడా వస్తుంది.
దీనిపై ఏదో ఒకటి మాట్లాడాలి.ఎక్కడ ఏమి మాట్లాడితే ఏ నష్టం జరుగుతుందో అన్న ఆందోళనతో ఇలా దూరంగా ఉంటున్నారట.

ఆర్టీసీ సమ్మె విషయంలో కేసీఆర్ మొండిపట్టు సొంత పార్టీ నేతలకు కూడా రుచించడంలేదట.అసలు కార్మికుల సమ్మె విషయంలో తాము ఏ విధంగా స్పందించాలి అనే విషయం స్పష్టత లేకపోవడంతో కొంతకాలం నియోజకవర్గానికి దూరంగా ఉండి ఈ సమస్య ఒక కొలిక్కి వచ్చిన తరువాత మాత్రమే నియోజకవర్గాలకు వెళ్తే మంచిదన్న భావనలో వారు ఉన్నట్టు తెలుస్తోంది.సమ్మె మొదలుపెట్టి నెల రోజులు దాటిపోయినా ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పఇంకెవరూ దీనిపై నోరు మెదపడంలేదు.మొదట్లో ఒకటి రెండు రోజులు మంత్రి తలసాని శ్రీనివాస్ మాట్లాడినా ఆ తరువాత ఆయన కూడా సైలెంట్ అయిపోయాడు.
ఇక అప్పటి నుంచి ఇతర మంత్రులుగానీ, ఎమ్మెల్యేలుగానీ సమ్మె ఊసెత్తడం లేదు.కార్మికుల ఆత్మహత్యలపై కూడా స్పందించలేదు.మంత్రి కేటీఆర్ కూడా ఇదే పద్దతి పాటిస్తున్నారు.ఇక టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు పరిస్థితి కూడా ఇంతే.

ఇలా అంతా మౌన ముద్ర వేసుకోవటానికి కారణం కూడా ఉందట.ఆర్టీసీ సమ్మె విషయంలో ఎవరూ నోరుమెదపవద్దని, మీడియా ఎంత గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేసినా సమాధానం చెప్పవద్దని, పొరపాటున నోరు జారారో ప్రభుత్వం అనవసర ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతుందని కేసీఆర్ హెచ్చరికలు చేసాడట.అందుకే మనకి ఎందుకొచ్చిన తలనొప్పి ఇది అనుకుంటూ ఎవరికి వారు హైదరాబాద్ లో రెస్ట్ తీసుకుంటూ గడిపేస్తున్నారు.నియోజకవర్గాలకు సంబంధించి ముఖ్యమైన పనులు ఏమైనా ఉంటే వాటికి సంబందించిన పేపర్లను తమ వద్దకే తెప్పించుకుని పనులు కానిచ్చుకుంటున్నారట.
అయితే సామాన్య ప్రజలు మాత్రం తమ సమస్యలను చెప్పుకునేందుకు అవకాశం లేక చాలా ఇబ్బందులే పడుతున్నారు.అయినా అధికార పార్టీ నాయకులు మాత్రం ఈ విషయంలో అధినేత హెచ్చరికలను గుర్తు చేసుకుంటూ సైలెంట్ గానే ఉండిపోతున్నారు.